బాహుబలిని క్రాస్ చేసిన 2.0

రజనీకాంత్ నటించిన 2.0 సినిమా ఇలా విడుదలైన వెంటనే అలా బాహుబలి-2 రికార్డులు కొల్లగొడుతుందని అంతా భావించారు. కానీ బాహుబలి-2 రికార్డుల్ని క్రాస్ చేయడం 2.0 వల్ల కాదని తేలిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న రికార్డులు బద్దలవుతున్నప్పటికీ…. బాహుబలి-2 ఓవరాల్ వసూళ్ల రికార్డును 2.0 బద్దలు కొట్టలేదనే విషయం స్పష్టమైంది. తాజాగా బాహుబలి-2కు చెందిన ఓ చిన్న రికార్డును మాత్రం రజనీకాంత్ అధిగమించాడు.

హిందీలో బాహుబలి-2 సినిమా 5 రోజుల్లో 117 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే, ఆ రికార్డును 2.0 క్లాస్ చేసింది. 5 రోజుల్లో ఈ సినిమాకు 120 కోట్ల రూపాయలు వచ్చాయి. త్రీడీలో సినిమా విడుదలవ్వడం, మొదటి వారం రోజులు టిక్కెట్లు రేట్లు కాస్త ఎక్కువగా ఉండడంతో ఇది సాధ్యమైంది.

ప్రస్తుతానికి 2.0 వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా నిలకడగా కొనసాగుతున్నాయి. విడుదలైన 4 రోజుల్లో 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 5రోజులకు గాను 451 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా బాహుబలి-2 కలెక్ట్ చేసిన మొత్తాన్ని ఇది అధిగమించడం దాదాపు అసాధ్యం.

ఎందుకంటే.. బాహుబలి-2కు దాదాపు 3 వారాల పాటు థియేటర్లు దొరికాయి. 2.0కు ఆ పరిస్థితి లేదు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు ఆటోమేటిగ్గా 2.0కు వసూళ్లు తగ్గుతాయి.