Telugu Global
NEWS

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు....

కంగారూ గడ్డపై టీమిండియాకు భలే చాన్స్ 70 ఏళ్ల కల సాకారానికి విరాట్ సేన తహతహ టీమిండియా…టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిరీస్ వెంట సిరీస్ విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. అయితే… ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న కల మాత్రం గత 70 ఏళ్లుగా… కలగానే ఉంటూ వస్తోంది. ప్రస్తుత 2018-19 సిరీస్ లో ఆ చిరకాల […]

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు....
X
  • కంగారూ గడ్డపై టీమిండియాకు భలే చాన్స్
  • 70 ఏళ్ల కల సాకారానికి విరాట్ సేన తహతహ

టీమిండియా…టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిరీస్ వెంట సిరీస్ విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది.

అయితే… ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న కల మాత్రం గత 70 ఏళ్లుగా… కలగానే ఉంటూ వస్తోంది. ప్రస్తుత 2018-19 సిరీస్ లో ఆ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు… టీమిండియా ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కంగారూ గడ్డపై సిరీస్ నెగ్గలేదని… ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్, మార్క్ వా, మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ లాంటి దిగ్గజాలు చెబుతున్నారు.

టీమిండియాకు గోల్డెన్ చాన్స్….

1947 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ లు ఆడుతూ వచ్చినా…గత ఏడు దశాబ్దాల కాలంలో ఒక్కటంటే ఒక్క సిరీస్ నెగ్గలేదంటే ఆశ్చర్యమే మరి. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్ వరకూ ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్ల నాయకత్వంలో ఆస్ట్రేలియా టూర్లకు వెళ్లినా భారతజట్లు టెస్ట్ సిరీస్ లు మాత్రం నెగ్గుకు రాలేకపోయాయి.

అయితే…మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2018-19 టెస్ట్ సిరీస్ లో మాత్రం…టీమిండియా విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం…టీమిండియా ఓవైపు అనూహ్యంగా బలపడటం… మరోవైపు ఆస్ట్రేలియా అసాధారణంగా బలహీనపడటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

కొహ్లీ హోరు…టీమిండియా జోరు….

విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా గత కొద్ది సంవత్సరాలుగా విజయపరంపర కొనసాగిస్తోంది. ఆడిన గత 15 టెస్ట్ సిరీస్ ల్లో టీమిండియా ఏకంగా 11 విజయాలు నమోదు చేసింది.

శ్రీలంక, విండీస్ టూర్లలో సైతం సిరీస్ విజయాలు సాధించింది. అయితే…సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లలో మాత్రం టీమిండియా పోరాడి ఓడక తప్పలేదు.

అయితే…ఆస్ట్రేలియా ఫాస్ట్ , బౌన్సీ వికెట్ల పై రాణించగల సత్తా ఉన్న బౌలర్లు ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్నారు. ఇశాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లాంటి ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లతో విరాట్ సేన అత్యంత పటిష్టంగా, ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది.

స్మిత్, వార్నర్ లేని ఆసీస్….

ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్…. బాల్ టాంపరింగ్ ఆరోపణలతో గత ఏడాది కాలంగా నిషేధం లో ఉండటంతో…యువ ఆటగాడు టిమ్ పెయిన్ నాయకత్వంలో ఆస్ట్రేలియా సిరీస్ సమరానికి సిద్ధమయ్యింది.

బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న కంగారూ టీమ్… బ్యాటింగ్ లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. టీమిండియా పవర్ పుల్ బౌలింగ్ ఎటాక్ ను… అనుభవం లేని ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్…. ఎంతవరకూ నిలబడగలదన్నది అనుమానమే.

విరాట్ కొహ్లీ పైనే టీమిండియా భారం…

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్….టీమిండియా తురుపుముక్క విరాట్ కొహ్లీ…మరోసారి తన జట్టు జయాపజయాలలో కీలకపాత్ర పోషించబోతున్నాడు. విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్న విరాట్ కొహ్లీ…సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో 286 పరుగులు సాధించాడు.

ఇంగ్లండ్ టూర్ లో సైతం విరాట్ కొహ్లీనే అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు.

2014 ఆస్ట్రేలియా టూర్ లో సైతం విరాట్ కొహ్లీనే అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా రికార్డుల్లో చేరాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ఏకంగా 692 పరుగులు సాధించి…. వారేవ్వా అనిపించుకొన్నాడు.

టాపార్డర్ రాణిస్తేనే….

విరాట్ కొహ్లీతో పాటు…ఓపెనర్లు మురళీ విజయ్, రాహుల్, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, 6వ నంబర్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…. అత్యుత్తమస్థాయిలో రాణించగలిగితేనే …టీమిండియా ఏడుదశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసుకోగలుగుతుంది.

ఆస్ట్రేలియా అత్యంత బలహీనంగా, అనుభవం లేమితో ఉన్న ప్రస్తుత తరుణంలో టీమిండియా నెగ్గకపోతే… మరెప్పుడూ కంగారూ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గలేదన్నది నిజంగా నిజం.

First Published:  5 Dec 2018 8:00 AM GMT
Next Story