తనకున్న వ్యాధిని బయటపెట్టిన కాజల్

ఆటో ఇమ్యూన్ డిజార్డర్.. కాజల్ కు ఉన్న ఆరోగ్య సమస్య ఇది. అప్పటికప్పుడే హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం ఈ రోగ లక్షణం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది. తను ఈ సమస్యతో దాదాపు 3 నెలలు మంచాన పడ్డానని ప్రకటించింది కాజల్.

ఈ ఏడాది ప్రారంభంలో ఈ వ్యాధికి గురైంది కాజల్. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో ప్రతి రోజు రాత్రి అయ్యేసరికి కాజల్ కు జ్వరం, ఒళ్లు నొప్పులు బాధించేవి. వరుసగా జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదించిన కాజల్, అసలు సమస్యను గుర్తించగలిగింది. ఫలితంగా 3 నెలల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని, వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని తెలిపింది కాజల్.

కవచం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది కాజల్. నిజానికి ఈ హీరోయిన్ కు ఇంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కనీసం గాసిప్స్ కూడా బయటకు రాలేదు. ఇదే విషయాన్ని కాజల్ కూడా చెప్పుకొచ్చింది. తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలియదని, ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చింది.