కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షలు సీజ్

తెలంగాణ ఎన్నికలు రేపే జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కట్టల పాములు బయటపడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కోట్లు పంచడానికి రెడీ అవుతున్నాయి. నిన్న వరంగల్ జిల్లా కాజీపేటలో కోట్ల రూపాయల డబ్బు బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన డబ్బులు బయటపడడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్ లోని కంటోన్మెంట్ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన డబ్బు రూ.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. సర్వేకు ప్రధాన అనుచరుడిగా పేరొందిన గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

సర్వే సత్యనారాయణ పేరిట ఉన్న ప్రచార సామగ్రిని, అందులో ఉన్న 50 లక్షలను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సర్వే సత్యనారాయణ కోరిక మేరకే ఆయన అనుచరుడు గాలి బాలాజీ బేగం బజార్ లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి 50 లక్షలను తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తెలిపారు.

ఇక టీడీపీకి చెందిన ఓ నేతవిగా చెబుతున్న రూ.40 లక్షలను కూడా పోలీసులు గచ్చిబౌలిలో పట్టుకున్నారు. ఎన్నికల్లో పంచడానికి తీసుకెళుతున్నట్టు గుర్తించి పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.