ఎన్నికల చిత్రాలు : ఫుల్లు బాటిల్ 10 రూపాయలు…. చిట్టీ ఇస్తే బీర్లు…. కోరితే ఇంటికే

తెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది గంటలే మిగిలి ఉంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇప్పటికే అభ్యర్థులు మద్యం, డబ్బు, గ్యాడ్జెట్స్ వంటివి పంచుతున్నారు. అయితే పోలీసుల నిఘా పెరిగిపోవడంతో పంపకాలకు కొత్త దార్లు వెతుకుతున్నారు. గత వారం రోజులుగా పోలీసులు, ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిన కొన్ని విచిత్రమైన కేసులు ఔరా అనిపిస్తున్నాయి.

నిన్నటి నుంచి ప్రచారం మాత్రమే కాకుండా మద్యం దుకాణాలు కూడా బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఒక వైన్స్‌లో జరిగిన సంఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. మాదాపూర్‌లోని సిటీ వైన్స్‌లో కొంత మందికి 10 రూపాయలకే ఛీప్ లిక్కర్ ఫుల్ బాటిల్…. 50 రూపాయలకు 600 విలువ చేసే ఫుల్ బాటిల్ మద్యం.. 100 రూపాయలు ఇస్తే విలువైన హైకాస్ట్ సరుకును ఇచ్చారు. దీంతో పోలీసులకు డౌట్ వచ్చి ఆరా తీశారు.

ఒక పార్టీకి చెందిన అభ్యర్థి వైన్స్ షాప్ యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ఓటర్లకు తానే 10, 50, 100 నోట్లు పంచి వాటి సీరియల్ నెంబర్లు వైన్ షాప్ సిబ్బందికి ఇచ్చాడంటా. ఆ నోట్ల మీద సీరియల్ నెంబర్ చూసి ఓటర్లకు సరుకు ఇచ్చారంట. ఈ విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలో గురువారం నాడు కొన్ని ప్రాంతాల్లో సిట్టింగులు ఏర్పాటు చేశారు. 20 నుంచి 30 మందిని ఒక చోట కూర్చో బెట్టి బార్ షాపుల్లా సప్లై చేశారని సమాచారం. అంతే కాకుండా ఇలాంటి సిట్టింగులకు రాని వాళ్ల ఇండ్లకే ఫుల్ బాటిల్స్ పంపామని ఒక కార్యకర్త చెబుతున్నాడు. కొంత మంది ఓటర్లకు చిట్టీలు ఇచ్చి పలానా చోట నుంచి మద్యం, డబ్బులు తెచ్చుకోవాలని చెబుతున్నారట..!

ఇలా విచిత్ర పద్దతుల్లో సాధ్యమైనంత వరకు ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.