Telugu Global
Health & Life Style

అమ్మ‌త‌నంలో కొత్త‌శ‌కం

ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో ఓ కొత్త శ‌కం మొద‌లైంది. మ‌ధుర‌మైన మాతృత్వం అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిన‌ప్పుడు దానిని అందిపుచ్చుకోవ‌డానికి కొత్త‌దారిని నిర్మించింది టెక్నాల‌జీ. గ‌ర్భం లేని మ‌హిళ త‌ల్ల‌యింది. గుండెపోటుతో మ‌ర‌ణించిన మ‌హిళ గ‌ర్భాశ‌యాన్ని గ‌ర్భాశ‌యం లేని మ‌హిళ‌కు అమ‌ర్చ‌డం ద్వారా ఈ అద్భుతాన్ని సాధించారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌ర‌ణించిన మ‌హిళ నుంచి సేక‌రించిన గ‌ర్భాశ‌యంతో గ‌ర్భ‌ధార‌ణ జ‌రిగి ఆరోగ్యంగా బిడ్డ ప్ర‌స‌వించ‌డం ఇదే తొలిసారి. బ్రెజిల్‌లో డిసెంబ‌ర్ నాలుగో తేదీన జ‌రిగిన‌ అద్భుతం ఇది. మేయ‌ర్ రోకిటాన్ స్కీ […]

అమ్మ‌త‌నంలో కొత్త‌శ‌కం
X

ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో ఓ కొత్త శ‌కం మొద‌లైంది. మ‌ధుర‌మైన మాతృత్వం అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిన‌ప్పుడు దానిని అందిపుచ్చుకోవ‌డానికి కొత్త‌దారిని నిర్మించింది టెక్నాల‌జీ. గ‌ర్భం లేని మ‌హిళ త‌ల్ల‌యింది. గుండెపోటుతో మ‌ర‌ణించిన మ‌హిళ గ‌ర్భాశ‌యాన్ని గ‌ర్భాశ‌యం లేని మ‌హిళ‌కు అమ‌ర్చ‌డం ద్వారా ఈ అద్భుతాన్ని సాధించారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌ర‌ణించిన మ‌హిళ నుంచి సేక‌రించిన గ‌ర్భాశ‌యంతో గ‌ర్భ‌ధార‌ణ జ‌రిగి ఆరోగ్యంగా బిడ్డ ప్ర‌స‌వించ‌డం ఇదే తొలిసారి.

బ్రెజిల్‌లో డిసెంబ‌ర్ నాలుగో తేదీన జ‌రిగిన‌ అద్భుతం ఇది. మేయ‌ర్ రోకిటాన్ స్కీ హాజ‌ర్ సిండ్రోమ్‌తో (గ‌ర్భాశ‌యం లేకుండా పుట్ట‌డం) బాధ‌ప‌డుతున్న 32 ఏళ్ల మ‌హిళ‌కు గుండెపోటుతో మ‌ర‌ణించిన 45 ఏళ్ల మ‌హిళ గ‌ర్భాశ‌యాన్ని ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ శ‌స్ర్త చికిత్స జ‌రిగి రెండేళ్ల‌యింది. 2016, సెప్టెంబ‌రు నెల‌లో శ‌స్త్ర చికిత్స చేసి రక్త‌నాళాలు, లిగ‌మెంట్‌లు, వెజైన‌ల్ కెనాల్స్‌ను అనుసంధానం చేశారు.

ఆ త‌ర్వాత ఆరునెల‌ల పాటు రెగ్యుల‌ర్‌గా మానిట‌ర్ చేశారు డాక్ట‌ర్లు. ఆ మ‌హిళ దేహం శ‌స్త్ర చికిత్స ద్వారా అమ‌ర్చిన గ‌ర్భాశ‌యాన్ని స్వీక‌రించింద‌నే సంకేతాల‌తో సంతృప్తి చెందారు. ఆ మ‌హిళ‌కు రుతుక్ర‌మం కూడా మొద‌లైంది.

అప్ప‌టి నుంచి ఆమె గ‌ర్భాశ‌యంలో ముందుగానే ఫ‌ల‌దీక‌ర‌ణ చెందించి ఫ్రీజ్ చేసి ఉంచిన అండాల‌ను ప్ర‌వేశ పెట్టారు. గ‌ర్భాశ‌యంలో పిండం మామూలుగానే పెరిగింది. 35 వారాల మూడు రోజులకు సిజేరియ‌న్ ద్వారా డెలివ‌రీ చేశారు. బిడ్డ రెండున్న‌ర కేజీల‌కు పైగా బ‌రువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది.

గ‌తంలో కూడా ప్ర‌యోగాలు జ‌రిగాయి

ఇలాంటి ప్ర‌యోగాలు ఇప్పుడే కొత్త కాదు. గ‌తంలో కూడా జ‌రిగాయి. స్వీడ‌న్‌లో 2013లో యుటిర‌స్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఫ‌ల‌వంత‌మై ప్ర‌స‌వం జ‌రిగింది. అయితే అది బ‌తికి ఉన్న దాత నుంచి సేక‌రించిన గ‌ర్భాశ‌యం. ఇప్పుడు మ‌ర‌ణించిన వ్య‌క్తి నుంచి సేక‌రించిన గ‌ర్భాశ‌యం కావ‌డం గుర్తించాల్సిన విష‌యం. బ‌తికి ఉన్న దాత‌ల నుంచి సేక‌రించిన గ‌ర్భాశ‌యాల‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేయ‌డం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది జ‌న్మించారు.

మ‌ర‌ణించిన వారి గ‌ర్భాశ‌యాల ట్రాన్స్ ప్లాంట్ విష‌యానికి వ‌స్తే… ఇంత‌కు ముందు అమెరికా, చెక్ రిప‌బ్లిక్‌, ట‌ర్కీ వంటి దేశాల్లో అనేక ప్ర‌యోగాలు జ‌రిగాయి, కానీ అవ‌న్నీ బిడ్డ‌ను ప్ర‌స‌వించ‌డంలో విఫ‌ల‌మైన కేసులే. దాంతో ఈ బ్రెజిల్ మ‌హిళ ప్ర‌స‌వం తొలి రికార్డును సొంతం చేసుకుంది.

త‌ప్ప‌ని స‌రి అయితేనే….

ఇక ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సాధార‌ణంగా బిడ్డ‌లు పుట్టే అవ‌కాశం లేని మ‌హిళ‌లు మాత్ర‌మే ఈ ప‌ద్ధ‌తిని అవ‌లంబించాల్సి ఉంటుంద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. ద‌త్త‌త తీసుకోవ‌డం లేదా స‌రోగ‌సీ వంటి ప‌ద్ధ‌తుల్లో బిడ్డ‌ను క‌న‌డం మాత్ర‌మే దారి అనుకున్న వాళ్లు ఈ ప్ర‌య‌త్నాన్ని చేయ‌వ‌చ్చు.

First Published:  6 Dec 2018 12:30 PM GMT
Next Story