ముందు బీజేపీ నేతల పేర్లు మార్చు యోగీ….

హిందుత్వ మూలాలు, ఆర్ఎస్ఎస్ అండదండలతో యూపీ సీఎంగా గద్దెనెక్కిన యోగి ఆదిత్య నాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో విలక్షణ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ లో బీజేపీ గెలిస్తే మొన్నటికి మొన్న హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తానన్న యోగి…. తాజాగా కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ పేరును కూడా ‘కరినగర్’గా మార్చేస్తానని ప్రకటించారు. కరి అంటే ఏనుగు అని… హిందువుల దైవంలాంటి ఏనుగు పేరుతో కరీంనగర్ పేరును మార్చేస్తానని అభయం ఇచ్చారు.

యూపీ సీఎంగా యోగి గద్దెనెక్కగానే ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు ఎక్కువగా ఉండే పలు పట్టణాల పేర్లు, ప్రాంతాల పేర్లను మార్చేశారు. యూపీలోని అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ ను అయోధ్యగా, మొగల్‌ సరాయి జంక్షన్ ను పీటీ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గా యోగి ఆధిత్యనాథ్ మార్చేసారు. ఇక బీజేపీ లామేకర్ జగన్ ప్రసాద్ ఆగ్రా ముస్లిం పేరు అని.. దాన్ని అగర్వన్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అగర్వాల్ కుటుంబీకులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారని…. అందుకే వారి పేరు మీదుగా అగ్రవాల్ పేరు కలిసేటట్టు పెట్టాలని ఆయన కోరుతున్నారు.

ఇక యూపీలోని ప్రతిపక్షాలు మాత్రం యోగి నిర్ణయాలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. చాలా పట్టణాలు, జంక్షన్ల పేరు మారుస్తున్న వైనంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓం ప్రకాష్ రాజ్ ధర్ సంచలన కామెంట్స్ చేశారు. ‘మొగలులు పెట్టిన పట్టణాల పేర్లు మార్చినట్టే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహనాజ్ హుస్సేన్, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉత్తరప్రదేశ్ మంత్రి మెహసీన్ రాజా లాంటి ముగ్గురు ముస్లిం నేతల పేర్లు కూడా అర్జంట్ గా మార్చండి’ అంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. పట్టణాల పేర్లు మార్చినట్టే బీజేపీ పెద్దల పేర్లు మార్చండి అని సెటైర్ వేశారు.

హైదరాబాద్ లో నిర్వహించిన భారీ ర్యాలీగా పాల్గొన్న యోగి హైదరాబాద్ ను ‘భాగ్యనగరం’గా మార్చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా వివిధ సందర్భాల్లో హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరీంనగర్ పేరును మారుస్తానని యోగి అనడం దుమారం రేగుతోంది. అభివృద్ధి గురించి కాకుండా హిందుత్వవాదంపై యోగి మాట్లాడడం సంచనలంగా మారింది.