సొంత చానల్‌ సర్వేనే నమ్మొద్దని రాజ్‌దీప్‌ చెప్పారా?

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉత్తమ్… రాబోయేది మహాకూటమి ప్రభుత్వమేనన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మశక్యంగా లేవన్నారు. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే టీఆర్‌ఎస్‌కు ఏకంగా 91 స్థానాలు రావొచ్చు అని చెప్పడంపై స్పందించిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి… ఆ చానల్‌ కన్సల్టెంట్‌ ఎడిటర్ రాజ్‌దీప్‌ సర్దేశాయే తనకు ఫోన్ చేశారని ఉత్తమ్ వివరించారు.

ఎగ్జిట్‌ పోల్‌ చూసి కంగారు పడవద్దని… ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్‌ చేసి రాజ్‌దీపే చెప్పారన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌తో తాను కూడా ఏకీభవించడం లేదని… పోటీ హోరాహోరీగా ఉందని రాజ్‌ దీప్ వివరించారని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కూటమికి 75 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

టైమ్స్ నౌ, రిపబ్లిక్ చానళ్లు కూడా టీఆర్‌ఎస్‌కే అధికారం వస్తుందని చెప్పడంపై స్పందించిన ఉత్తమ్ ఆ చానళ్లు బీజేపీకి అనుకూలమని అందుకే అలా చెప్పాయని ఆరోపించారు.