రామ్ చరణ్ సినిమాలో ఈషా గుప్తా

అభినేత్రి సినిమాలో చిన్న స్పెషల్ ఎప్పీయరెన్స్ ఇచ్చింది ఈషా గుప్తా. కానీ ఆ సినిమా ఇక్కడ క్లిక్ అవ్వలేదు. సచిన్ నటించిన వీడెవడు సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా ఆమెకు కలిసిరాలేదు. ఎట్టకేలకు ఈషా గుప్తాకు తెలుగులో బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అదే వినయ విధేయ రామ.
అవును.. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో వస్తున్న వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఈషా గుప్తాను తీసుకున్నారు. ఎల్లుండి నుంచి ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ పబ్ సెట్ రెడీ అయింది. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావిస్తోంది ఈషా గుప్తా. టాలీవుడ్ లో లేటెస్ట్ ఐటెం భామగా మారిపోవాలని కలలుకంటోంది.
చాలా పోటీ మధ్య ఈషాను ఈ అవకాశం వరించింది. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను అనుకున్నారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ కు నిర్మాత డీవీవీ దానయ్యకు చుక్కలు కనిపించాయి. తర్వాత క్యాథరీన్ ను అనుకున్నారు. కానీ పబ్ సెట్ లో ఆమె సరిగ్గా సెట్ అవ్వదని భావించారు. అల్ట్రా మోడ్రన్ గా కనిపించే ఈషా, సరిగ్గా సెట్ అవుతుందని భావించి ఆమెకు ఈ ఛాన్స్ ఇచ్చారు.