మీ-టూ: తొలి దెబ్బ అతడిపైనే..!

బాలీవుడ్ లో మీ-టూ ఉద్యమం మొదలై చాలా రోజులైంది. దీనిపై కేసులు కూడా నడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరిపై అధికారికంగా చర్యలు తీసుకున్న సందర్భాల్లేవ్. ఎట్టకేలకు ఆ ప్రక్రియ కూడా మొదలైంది. తొలి వేటు దర్శకుడు సాజిద్ ఖాన్ పై పడింది. ఈ డైరక్టర్ పై లెక్కలేనన్ని అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరక్టర్స్ అసోసియేషన్ (IFTDA) వీటిపై స్పందించింది. విచారణ జరిపి సాజిద్ ఖాన్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

ఏడాది పాటు బాలీవుడ్ లో ఏ సినిమాకు, ఏ టెలివిజన్ వర్క్ కు పనిచేయకూడదంటూ సాజిద్ పై నిషేధం విధించింది ఐఎఫ్టీడీఏ. ఈ నిషేధం తక్షణం అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. సాజిద్ పై నిషేధంతో అతడిపై ఆరోపణలు చేసిన మహిళలు ఆనందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లకు తమ పోరాటానికి గుర్తింపు లభించిందంటున్నారు.

సాజిద్ ఖాన్ పై వేటు పడడంతో నెక్ట్స్ టార్గెట్ ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా తమ నెక్ట్స్ టార్గెట్ ఎవరో కూడా చెప్పేసింది ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరక్టర్స్ అసోసియేషన్ (IFTDA). సీనియర్ నటుడు అలోక్ నాధ్ పై విచారణను ప్రారంభించబోతున్నామని తెలిపింది. 15 ఏళ్ల కిందట ఉదంతాలకు సంబంధించిన ఆరోపణలివి. వాటిపై సంస్థ ఎలా దర్యాప్తు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.