96 రీమేక్ కు తెలుగు హీరో దొరికాడు…. అయితే….

దాదాపు నెల రోజులుగా టాలీవుడ్ లో నలుగుతుంది 96 సినిమా. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటిస్తారనే డౌట్ అందర్లో ఉండేది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ అయితే దక్కించుకున్నాడు కానీ, హీరోను మాత్రం పట్టలేకపోయాడు. ఇప్పుడీ రీమేక్ కు ఎట్టకేలకు హీరో దొరికాడు. అతడే శర్వానంద్.

అవును.. 96 రీమేక్ లో నటించేందుకు శర్వానంద్ దాదాపు ఓకే చెప్పాడు. 3 రోజుల కిందట ప్రత్యేకంగా ఈ సినిమా చూసిన శర్వా.. సినిమాకు తనకు బాగా నచ్చిందని, పడి పడి లేచే మనసు సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే మిగతా విషయాలు మాట్లాడుకుందామని దిల్ రాజుకు చెప్పాడు.

అంతా బాగానే ఉంది కానీ శర్వాకు దర్శకుల విషయంలో బాగా పట్టింపు. దిల్ రాజు చెప్పిన దర్శకుడినే ఓకే చేయడం శర్వాకు ఇష్టంలేదు. పైగా తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి శర్వా కొన్ని మార్పులు చేర్పులు చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే శర్వానంద్ ఈ ప్రాజెక్టులో ఉన్నాడో లేదో తెలుస్తుంది.

మొదట ఇందులో నాని నటిస్తాడని అంతా అనుకున్నారు. దిల్ రాజుతో కలిసి చెన్నై వెళ్లి మరీ సినిమా చూసొచ్చాడు నాని. కానీ తర్వాత తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇది బన్నీ చెంతకు చేరింది. ఇలాంటి కథలు తనకు నప్పవంటూ బన్నీ కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ వంతు వచ్చింది. అయితే ఏ విషయం మరో వారం రోజుల్లో తేలిపోతుంది.