తుపానులనూ వదలని బాబు రాజకీయం

(ఎస్‌.వి.ఆర్‌)

ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా అవి రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడాలి. మంచి జరిగినా, చెడు సంభవించినా వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవటమే ఆయన రాజకీయ లక్ష్యం. అవి చావులైనా, ప్రకృతి వైపరీత్యాలైనా ఆయనకు అతీతం కాదు. తాజాగా పెథాయ్‌ తుపాను వచ్చిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు అందుకు పెద్ద ఉదాహరణ.

పెథాయ్‌ తుపాన్‌ పెనుగండం తప్పిపోయిందని, ఆ గండాన్ని తప్పించడంలో తాను, తన ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంతా కాదని గత రెండు రోజులుగా ఆయన చెప్పుకుంటున్న తీరు చూస్తే…. తుపాన్‌ తక్కువ నష్టాన్ని కలిగించి…. అంతగా ప్రభావం చూపకుండా వెళ్లిపోయినప్పటికీ…. అది తన ప్రభుత్వ ప్రమేయం వల్లనే అలా జరిగినట్లు చెప్పుకోవడానికి ఆయన వెనుకాడటం లేదు. మీడియా కూడా అందుకు వంత పాడుతోంది.

కోస్తాంధ్రకు తుపానులు కొత్తేమీ కాదు. దివిసీమ లాంటి భయంకరమైన తుపాన్‌లను తీరప్రాంతం ప్రతీఏటా చవిచూస్తూనే ఉంది. గోదావరి వరదలకు ఉభయ గోదావరి జిల్లాలు మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతం అప్పుడప్పుడు కకావికలం అవుతూనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించి వీలైనంతవరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేవిధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రత్యేక యంత్రాంగాలు, విధానాలు కూడా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో హుదూద్‌, తిత్లీ, పెథాయ్‌లాంటి తుపాన్‌లు కోస్తాంధ్రను తాకాయి. వాటిలో హుదూద్‌ విశాఖకు ఎక్కువ నష్టం కలిగించింది. తిత్లీ, పెథాయ్‌లాంటి తుపాన్‌లలో నష్టాన్ని తామే తగ్గించగలిగామని పదేపదే చెబుతున్న చంద్రబాబు హుదూద్‌ తుపాన్‌ వల్ల విశాఖకు అంత నష్టం కలగకుండా ఇదే విధంగా ఎందుకు తగ్గించలేకపోయారో సమాధానం ఉండదు.

తిత్లీ, పెథాయ్‌ తుపాన్‌లు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించినప్పటికీ గతంలో సంభవించిన అనేక తుపాన్‌లతో పోలిస్తే ఇది సాధారణమైనది. అందువల్ల సహజంగానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భయంకరమైన తుపాన్‌లతో పోలిస్తే తక్కువగానే ఉంది. అంతేకానీ వీటి వెనుక చంద్రబాబు నాయుడు తుపాన్‌ నష్టాన్ని తగ్గించగలగడం కానేకాదు. నిజానికి తుపాన్‌ సమయంలో ఆయన రాష్ట్రాన్ని విడిచిపెట్టి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు లేకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకుని ఎటువంటి హడావుడి, ప్రోటోకాల్‌ లేకుండా తమ పనిలో తాము నిమగ్నమై తీరప్రాంత ప్రజలను తుపాన్‌ షెల్టర్లలోకి తరలించారు. ఎటువంటి హడావుడి, ప్రచార ఆర్భాటం లేకుండా ఈ పని జరిగిపోయింది.

వాస్తవానికి భయంకరమైన తుపాన్‌లతో పోలిస్తే పెథాయ్‌ వల్ల పెద్దగా నష్టం సంభవించలేదనడానికి మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎండ కాయడమే. దానికితోడు అదే రోజు చంద్రబాబు జిల్లాలో పర్యటించగలిగారు. 1996లో కోనసీమ ప్రాంతం తుపాన్‌కు విలవిల్లాడిపోయింది. అప్పట్లో ఆ ప్రాంతానికి చేరడానికి 4,5 రోజులు పట్టింది. కానీ ముఖ్యమంత్రి తుఫాన్‌ తీరం దాటిన వెంటనే జిల్లాలో పర్యటించారంటే అప్పటి తుపాన్‌లతో పోలిస్తే పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావం ఎంత తక్కువ ఉందో అంచనా వేయవచ్చు.

ఇది ప్రకృతికి సంబంధించింది. ఇందులో ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగిందేమీ లేదు.

తుపాన్‌ తీరం దాటిన తరువాత జిల్లాలో పెద్దగా వర్షాలు కురిసింది కూడా లేదు. ముఖ్యమంత్రి పర్యటన కోసమే తుపాన్‌ షెల్టర్లలో ఉంటున్న వారిని వారి ఇళ్లకు వెళ్లకుండా అధికారులు ఆపేశారు. తమ ఇళ్లకు, గ్రామాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని తాము వెళ్లిపోతామని పదేపదే చెప్పినప్పటికీ అధికారులు వారిని ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించేవరకు ఉండాలంటూ అడ్డుకున్నారు. దీనిని బట్టి రాజకీయ అవసరాలకోసం తుపాన్‌ను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో స్పష్టమైపోతోంది.

తుపాన్‌ను ముందే భారతీయ వాతావరణ కేంద్రం (ఐఎమ్‌డి) పసిగట్టింది. దాని వల్ల రైతులు పొల్లాలోని తమ పంటలను సురక్షిత ప్రాంతానికి తరిలించుకున్నారు. దీనివల్ల కూడా నష్టం తగ్గింది. పెథాయ్‌ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలు ప్రభావితమైయ్యాయి. 5,600 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 25 బోట్లు, 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ అంకెలే చెబుతున్నాయి గత తుపాన్‌లతో పోలిస్తే ఇది తక్కువ ప్రభావమే చూపిందని.

దేశంలో ఐఎమ్‌డి మెరుగైన వ్యవస్థ, పైగా పురాతనమైనది కూడా. ఇది ఇచ్చే సమాచారం ఆధారంగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతుంటాయి. కానీ ఏపి ముఖ్యమంత్రి మాత్రం ఐఎమ్‌డి కన్నా మెరుగైన వ్యవస్థను ఏపిలో తయారుచేశామని చెబుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి సమాచారం సేకరించే ఉపగ్రహ సమాచార వ్యవస్థ లేనే లేదు.

ఐఎమ్‌డి సమాచారాన్నే క్రోడీకరించి దాని ఆధారంగా ఆ సమాచారాన్ని ప్రజలకు అందించడానికి ఏపిలో ఆర్టీజీఎస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆర్టీజీఎస్‌నే నష్టాన్ని తగ్గించిందని తుపాన్‌ ప్రభావం లేకుండా చేయగలిగిందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఈ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సోసైటి (ఆర్టీజీఎస్‌) కేవలం ప్రజలకు సమాచారం అందించే వ్యవస్థ మాత్రమే.

ఈ ఆర్టీజీఎస్‌ ఇచ్చే సమాచారం ఆధారంగా ఎల్లో మీడియా, మరీ ముఖ్యంగా కొన్ని టీవీ చానెళ్లు విస్తృతంగా ఉదరగొట్టేస్తుంటాయి. ఇది ఛానెళ్ళ రేటింగ్‌లో భాగం కావడమే కాకుండా ఏపి ప్రభుత్వ రాజకీయ వ్యూహంలో భాగం. ఆ తరువాత తుపాన్‌ పెద్దగా నష్టం కలిగించకపోతే తమ ప్రచారం వల్లనే సమర్థంగా ఎదుర్కొగలిగామని చెప్పుకుంటున్నారు. ఒకవేళ హుదూద్‌ లాంటి తీవ్ర నష్టం సంభవిస్తే అది ప్రజల వైఫల్యంగా నెట్టేస్తుంటారు.

ప్రభుత్వం ముందుచూపు, ప్రణాళికబద్ధమైన కార్యచరణ, సాంకేతికత సమర్థ వినియోగం, క్షేత్రస్థాయి సిబ్బందిని ముఖ్యమంత్రి పనిచేయించడం వల్లనే పెథాయ్‌ తుఫాన్‌కు అడ్డుకట్ట వేయగలిగారని ప్రభుత్వ ప్రకటనల్లో ఉదరగొట్టేశారు. వాస్తవానికి పెథాయ్‌ అంత పెద్ద తుపాన్‌ కానేకాదనేది నష్టాలే స్పష్టం చేస్తున్నాయి.

పైగా తుపాన్‌ గాలి గాని, వర్షం గాని జిల్లాలో ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ చంద్రబాబు కృషి వల్లనే నష్టం తగ్గిందంటూ ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న యాగి చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ అవసరాల కోసం ఎంత దారుణంగా వాడుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.