Telugu Global
Family

కైకసి

ఎవరి ప్రవర్తనైనా నొప్పించినా – వారి నడవడిక బాధించినా – వారి వారి చెడు అలవాట్లు చేటు తెచ్చినా – “ఎవరు కన్నారు?” అని, “యేం పెంచారు?” అని తల్లిదండ్రుల్ని తలచుకోవడం తెలుసుకదా?, అలా అయితే “కైకసి”ని తలచుకోవాల్పిందే.. తెలుసుకోవాల్సిందే! కైక వేరు. కైకసి వేరు. కైకసి రావణ కుంభకర్ణులూ విభీషణ శూర్పణఖలకు తల్లి. అంతకన్నా ముందు సుమాలి కూతురు. ఒక రోజు కైకసి తన తండ్రి రథంమీద వెళుతూ విశ్రవసుని చూసింది. తండ్రి సుమాలికి కూడా […]

ఎవరి ప్రవర్తనైనా నొప్పించినా – వారి నడవడిక బాధించినా – వారి వారి చెడు అలవాట్లు చేటు తెచ్చినా – “ఎవరు కన్నారు?” అని, “యేం పెంచారు?” అని తల్లిదండ్రుల్ని తలచుకోవడం తెలుసుకదా?, అలా అయితే “కైకసి”ని తలచుకోవాల్పిందే.. తెలుసుకోవాల్సిందే!

కైక వేరు. కైకసి వేరు. కైకసి రావణ కుంభకర్ణులూ విభీషణ శూర్పణఖలకు తల్లి. అంతకన్నా ముందు సుమాలి కూతురు.

ఒక రోజు కైకసి తన తండ్రి రథంమీద వెళుతూ విశ్రవసుని చూసింది. తండ్రి సుమాలికి కూడా అతనికి తన కూతుర్ని యివ్వాలని పించింది. అందుకే విశ్రవసుని ఆశ్రమంలో కైకసిని విడిచి పెట్టాడు. కైకసి కూడా విశ్రవసునికి ఎన్నో సేవలుచేసింది. గమనించిన విశ్రవసుడు “ఎవరునువ్వు” అని అడిగాడు. కైకసి తన గురించి చెప్పడమే కాదు, తన మనసులోని కోరికనూ అతని ముందుంచింది. వాంఛను బయట పెట్టేలా ప్రవర్తించింది. సంధ్యవేళలో కోరావు కాబట్టి నీకు పుట్టిన వాళ్ళు రాక్షసులవుతారని చెప్పాడు. చెప్పిన విధంగానే ఆమె సంతానం రాక్షసులయ్యారు. అయితే తనకు పుట్టిన వాళ్ళందరూ దుర్మార్గులు కావలసిందేనా అని దుఃఖ పడింది కైకసి. అందరిలోకి చిన్నవాడు మంచి గుణవంతుడవుతాడని చెప్పి విశ్రవసుడు ఆమెకు ఊరట నిచ్చాడు. అతడే విభీషణుడు.

ఆగ్రహావేశాల విశ్రవసుని శాంతింపజేయడానికి ముగ్గురమ్మాయిల్ని యిచ్చాడట కుబేరుడు. పుష్పోత్కట, మాలిని, పాక, పుష్పోత్కటతో రావణ కుంభకర్ణులనూ – మాలినితో విభీషణుడునూ – పాకతో ఖరుడూ శూర్పణఖనూ కన్నారని మరో కథ చెపుతోంది.

విచిత్ర రామాయణం కథ ప్రకారమయితే – పుత్రుల్ని కోరిన కైకసితో విశ్రవసువు రుతువుకొక పుత్రుణ్ని యిస్తానన్నాడట. అప్పటికామె పదకొండు రుతువులయ్యానని చెపుతుందట. అంతమందిని కనక్కర్లేదనీ అంటుందట. దాంతో పది తలల పుత్రుడు రావణుడూ ఒక పుత్రిక శుర్పణఖా పుట్టిందట.

వేళకాని వేళలో కైకసి పుత్రుల్ని అర్ధించి వాంచించిన కారణంగానే తన సంతానం రాక్షస స్వభావంతో పుట్టినట్టు కైకసి కథ చెబుతోంది!.

First Published:  19 Dec 2018 8:27 PM GMT
Next Story