ఉద్యోగినులకు బెంగ‌ళూరు బెస్ట్‌

ఉద్యోగాలు చేసే మ‌హిళ‌ల సంఖ్య ఒక్క ద‌శాబ్దంలోనే అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఉద్యోగినులంతా ఎక్క‌డ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న న‌గ‌రాల జాబితా కోసం ఓ సారి దేశ‌మంత‌టా దుర్భిణీ వేసి చూస్తే తెలిసిందేమిటంటే… తొలిస్థానంలో బెంగ‌ళూరు ఉంది.

ఇంత‌మంది మ‌హిళ‌లు బెంగళూరు బాట ఎందుకు ప‌డుతున్నార‌ని మ‌ళ్లీ ఆరా తీస్తే… బెంగ‌ళూరులో ఉద్యోగినుల‌కు సేఫ్టీ బాగుంది. కంపెనీలు అనుస‌రించే సేఫ్టీ మెజ‌ర్స్ ప‌టిష్టంగా ఉంటున్నాయి. అలాగే బెంగ‌ళూరులో వైవిధ్య‌భ‌రిత‌మైన ఉద్యోగాల‌కు అవ‌కాశం ఉండ‌డం కూడాన‌ట‌.

ఈ ఉద్యోగినుల్లో ఎక్కువ మంది ఐటి, హాస్పిటాలిటీ, ట్రావెల్‌, బ్యాంకింగ్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ రంగాల్లో సేవ‌లందిస్తున్నారు. పైగా ఆయా కంపెనీలు మ‌గ‌వాళ్ల‌కంటే మ‌హిళ‌ల‌ను ఉద్యోగంలో చేర్చుకోవ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నాయ‌నేది మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం.

బెంగ‌ళూరు త‌ర్వాత‌

మ‌హిళ‌ల‌కు ఉద్యోగం ఇస్తున్న న‌గ‌రాల్లో తొలిస్థానంలో బెంగ‌ళూరు ఉంటే ఆ త‌ర్వాతి స్థానాల్లో హైద‌రాబాద్‌, ముంబ‌యి, పూనా న‌గ‌రాలున్నాయి. మ‌హిళ‌లు కెరీర్ మేనేజ్‌మెంట్‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌లో ఏ మాత్రం రాజీ ప‌డ‌క‌పోవ‌డం కూడా మ‌హిళా ఉద్యోగులు రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.

ఇండియా స్కిల్స్ రిపోర్టు భార‌త‌దేశంలోనే 29 రాష్ట్రాలు, 7 కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మొత్తం మూడు ల‌క్ష‌ల ప‌దివేల మందితో మాట్లాడింది.

ఒక్కొక్క వంద‌కు పైగా సంస్థ‌ల నుంచి స‌మాచారాన్ని, అభిప్రాయాల‌ను సేక‌రించింది. మొత్తం మీద మ‌హిళ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాల రీత్యా కానీ ర‌క్ష‌ణ ద్రుష్ట్యా కానీ బెంగళూరు న‌గ‌ర‌మే బెస్ట్ అని చెప్పాల్సిందే.