ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కే హైలైట్ బాక్సింగ్ డే టెస్ట్

  • క్రిస్మస్ మరుసటి రోజునుంచే జరిగే బాక్సింగ్ డే టెస్ట్
  • మెల్బోర్న్ వేదికగా ఏడాదికి ఓ బాక్సింగ్ డే టెస్ట్
  • ఏటా డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ ఆతిథ్యం
  • 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులో 7సార్లు టీమిండియా పోటీ

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా- మాజీ నంబర్ వన్ ఆస్ట్రేలియా జట్ల మూడోటెస్ట్ కు….ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. క్రిస్మస్ మరుసటి రోజున ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను …బాక్సింగ్ డే టెస్ట్ గా నిర్వహిస్తున్నారు. 

వింతల సమాహారం టెస్ట్ క్రికెట్….

దశాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో…. ఎన్నో వింతలు, విడ్డూరాలు, విశేషాలు, సాంప్రదాయాలు. ఐదు రోజుల పాటు… నాలుగు ఇన్నింగ్స్ గా సాగే టెస్ట్ పోటీలను… ఓ పండుగలా నిర్వహించడం… క్రికెట్ అగ్రరాజ్యాలు భారత్, ఆస్ట్రేలియా బోర్డులకు ఓ అలవాటుగా వస్తోంది.

ప్రతి ఏడాదీ సంక్రాంతి రోజున…. చెన్నై చెపాక్ స్టేడియంలో గతంలో టెస్టు మ్యాచ్ లు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. ఇక…ఆస్ట్రేలియాలోని ప్రపంచ మేటి క్రికెట్ వేదిక మెల్బోర్న్ స్టేడియంలో… క్రిస్మస్ మరుసటి రోజు నుంచి…. బాక్సింగ్ డే టెస్ట్ పేరుతో మ్యాచ్ లు నిర్వహించడం…. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే.

క్రిస్మస్ మరుసటి రోజునుంచే….

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు జరుపుకొనే అతిపెద్ద పండుగ క్రిస్మస్. ఏడాది పొడుగునా శ్రమించే తమతమ సంస్థల ఉద్యోగులు, పనివారికి క్రిస్మస్ పండుగ సెలవు ఇవ్వడంతో పాటు… పారితోషికాలు, బహుమతులు ఇవ్వడం బ్రిటీష్ పాలిత దేశాలలో ఓ ఆచారం.

అంతేకాదు… క్రిస్మస్ వేడుకలలో భాగంగా…. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలలో క్రికెట్ మ్యాచ్ లు ఆడటం కూడా ఓ ఆనవాయితీ. 1950 టెస్ట్ సిరీస్ లో భాగంగా…. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు … క్రిస్మస్ మరుసటి రోజు నుంచి ఆడిన టెస్ట్ మ్యాచ్ ను… బాక్సింగ్ డే టెస్టుగా నిర్వహించారు.

బాక్సింగ్ డే టెస్టులు 42

 నాటినుంచి…2017 బాక్సింగ్ డే టెస్ట్ వరకూ… క్రికెట్ ఆస్ట్రేలియా మొత్తం 42 బాక్సింగ్ డే టెస్టులు నిర్వహించింది.

అయితే…1980 నుంచి మాత్రమే క్రమం తప్పకుండా ప్రతిఏడాది… క్రిస్మస్ మరుసటి రోజు నుంచి …మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈమ్యాచ్ లకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం, స్టేడియం కళకళలాడి పోవడం…. క్రిస్మస్ వేడుకలకే వన్నె తెస్తోంది.

తండోపతండాలుగా అభిమానులు…

2017 యాషెస్ సిరీస్ లో భాగంగా …జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు…ఓవరాల్ గా 2 లక్షల 61 వేల 335 మంది హాజరు కావడం ఓ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుగా నిలిస్తే…. 2017 డిసెంబర్ 26న…అదీ బాక్సింగ్ డే రోజు ఆటకు సైతం 88 వేల 173 మంది హాజరై.. వారేవ్వా అనిపించారు.

ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు మాత్రమే కాదు… టీమిండియా సైతం… బాక్సింగ్ డే టెస్టుల్లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఆడుతూ వస్తోంది.

ఏడు బాక్సింగ్ డే టెస్టుల్లో భారత్…

1985 సిరీస్ నుంచి 2014 సిరీస్ వరకూ…. టీమిండియా…మొత్తం ఏడుసార్లు బాక్సింగ్ డే టెస్టుల్లో పాల్గొని… ఐదు పరాజయాలు, రెండు మ్యాచ్ ల డ్రా…రికార్డు సాధించింది.

ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో సైతం…ఈనెల 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య కంగారూలతో …టాప్ ర్యాంకర్ టీమిండియా అమీతుమీకి సిద్ధమయ్యింది.

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్ట్ లో టీమిండియా 31 పరుగులతో కంగారూలను ఓడిస్తే….పెర్త్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ లో ఆసీస్ జట్టు 146 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసి బదులు తీర్చుకోడమే కాదు..1-1తో సమ ఉజ్జీగా నిలిచింది.

డూ ఆర్ డైగా 2018 బాక్సింగ్ డే టెస్టు…

దీంతో…ప్రస్తుత బాక్సింగ్ డే టెస్ట్ …రెండుజట్లకూ డూ ఆర్ డై గా మారింది. బాక్సింగ్ డే టెస్టులో నెగ్గిన జట్టుకే సిరీస్ కైవసం చేసుకొనే అవకాశాలు ఉండడంతో…. రెండు జట్లూ విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి. మరి…ఈ బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు ఆటకు… అభిమానులు ఏ రేంజ్ లో హాజరుకాగలరన్నదే ఇక్కడి అసలు పాయింట్.