Telugu Global
Family

దశరథుడు

పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరొస్తుంది. ఉన్నపేరు ఇనుమడిస్తుంది. “ఎంత గొప్ప బిడ్డను కన్నావయ్యా” అని లోకం కీర్తిస్తుంది, కీర్తొస్తుంది. రాముడున్నంతకాలం… దశరథ రాముడన్నంతకాలం రాముడికి ముందు దశరథుడూ వుంటాడు! సూర్య వంశానికి చెందిన ఆజుని కొడుకు దశరథుడు. దశరథునికి ముగ్గురు భార్యలు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. మరి కైకకు మాత్రమే దశరథుడు వరాలెందుకిచ్చాడు? ఇంద్రునితో కలిసి దశరథుడూ శంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. తోడుగా వచ్చిన కైక కారణంగానే దశరథునికి విజయం వరించింది. అదే వరాలు యివ్వడానికి […]

పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరొస్తుంది. ఉన్నపేరు ఇనుమడిస్తుంది. “ఎంత గొప్ప బిడ్డను కన్నావయ్యా” అని లోకం కీర్తిస్తుంది, కీర్తొస్తుంది. రాముడున్నంతకాలం… దశరథ రాముడన్నంతకాలం రాముడికి ముందు దశరథుడూ వుంటాడు!

సూర్య వంశానికి చెందిన ఆజుని కొడుకు దశరథుడు. దశరథునికి ముగ్గురు భార్యలు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. మరి కైకకు మాత్రమే దశరథుడు వరాలెందుకిచ్చాడు? ఇంద్రునితో కలిసి దశరథుడూ శంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. తోడుగా వచ్చిన కైక కారణంగానే దశరథునికి విజయం వరించింది. అదే వరాలు యివ్వడానికి కారణమైంది.

మరోవైపు – వేటకు వెళ్ళిన దశరథుడు నీటిలోంచి బుడబుడమని వస్తున్న శబ్దాన్ని విని ఆవైపుగా బాణం వేసాడు. ఊహించినట్టుగా ఏనుగు కాదు, ఓ బాలుడు నీటిలో కడవను ముంచుతుండగా వచ్చిన శబ్దమది. అలా ప్రాణాలు విడిచిన శ్రవణకుమారుడు తన తలిదండ్రులు వృద్ధాప్యంలో వుండి దాహంతో అలమటిస్తున్నారని వాళ్ళకి నీళ్ళను యివ్వవలసిందిగా ఆఖరి కోరిక కోరాడు. దశరథ మహారాజు ఆకోర్కెను నెరవేర్చాడు. కాని శ్రవణుని తల్లిదండ్రులు నిజం తెలిసి వేదనతో “మాకు కలిగిన ఈ పుత్రశోకం నీవు కూడా అనుభవించుదువు గాక!” అని శపించారు.

తదనంతరకాలంలో దశరథుడు పుత్రశోకాన్ని అనుభవించాడు. పిల్లలు లేక పుత్ర కామేష్టి యాగం చేసిన దశరథుడు యాగ ఫల ఫలితంగా వచ్చిన పాయసాన్ని కౌలస్యకు సగమూ కైకకు సగమూ యిచ్చాడు. వారిద్దరూ అలా మిగిల్చిన సగమూ సగమూ సుమిత్ర సేవించింది. కౌసల్యకు రాముడు, కైకు భరతుడు, సుమిత్ర లక్ష్మణ శత్రుజ్ఞుల్ని కన్నారు.

బాల్యంలోనే విద్యాబుద్దులు నేర్చుకుంటున్న సమయంలోనే విశ్వామిత్రుడు వచ్చి యాగ రక్షణ కోసం రామలక్ష్మణుల్ని తన వెంట తీసుకెళ్తాడు. దశరథుడు కాదని చెప్ప లేకపోయినా అది పుత్రుల ఎడబాటుకు మొదలని చెప్పుకోవాలి.

జనకుని ఇంట రామునితోపాటు లక్ష్మణ భరత శత్రుఘ్నల పెళ్ళిళ్ళు జరిపించి అయోథ్యకు తిరిగి వచ్చారు. శ్రీరాముని పట్టాభిషేక సమయంలో కైక కోరకూడని వరాలు కోరడంతో – రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం వాటిని పాటించడంతో – అడవులపాలు కావడంతో పుత్రుని ఎడబాటుతో – దశరథ మహారాజు కుంగి పోయాడు. ఇటు రామ లక్ష్మణులు అరణ్యాలకు పోగా భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటనే వుండి పోవడంతో పుత్రులు వుండీ లేని వాడయ్యాడు. పెద్ద కొడుకు రాముణ్ని తలచుకుంటూ పుత్రకోశంతోనే కన్నుమూసాడు దశరథుడు.

అందుకే రాముడు జగదభిరాముడే కాదు, దశరథ రాముడు కూడా!

Also Read About Sri Rama పిల్లలకోసం పురాణ పాత్రల పరిచయం : రాముడు

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  23 Dec 2018 7:15 PM GMT
Next Story