మెక్‌డొనాల్డ్స్ కంటే మా వద్ద శుభ్రత ఎక్కువ – చంద్రబాబు

వైఎస్ జగన్‌ ఇస్తున్న ఎన్నికల హామీలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏమి తెలుసని జగన్‌ అన్ని ఇచ్చేస్తానంటూ కబుర్లు చెబుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కు ఉన్నంత అనుభవం కూడా లేదన్నారు. ఇలాంటి అనుభవ శూన్యత ఉన్న వ్యక్తులతో భవిష్యత్తులో రాష్ట్రానికే ప్రమాదమని హెచ్చరించారు. శ్వేత పత్రాల విడుదలలో భాగంగా సంక్షేమ రంగంపై వైట్‌ పేపర్‌ను చంద్రబాబు విడుదల చేశారు.

సంక్షేమంలో అభివృద్ధి అగ్రస్థానంలో ఉందన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఇంత తక్కువ ధరకు దేశంలో ఎక్కడైనా ఇంత క్యాలిటీ ఆహారం దొరుకుతోందా? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లలో ఉన్నంత శుభ్రత, నాణ్యత మెక్‌డొనాల్ట్స్, కేఎఫ్‌సీలలో కూడా ఉండదన్నారు.

వస్తున్న ఆదాయంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అందు వల్లే రాజధానికి వేరే మార్గాల్లో నిధులు సమీకరిస్తున్నట్టు చెప్పారు.

లైఫ్ సైకిల్ విధానం ద్వారా కడుపులో బిడ్డ పిండంగా ఉన్న దశ నుంచి మనిషి చనిపోయే వరకు ప్రభుత్వం ప్రతి దశలోనూ సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. పైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను విస్తరించామన్నారు. ఇప్పుడు ఎవరైనా సొంతూరు నుంచి కూడా పనిచేసుకునే వెసులుబాటును తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు.