సాక్షి ఆఫీస్‌ ముందు పరిటాల శ్రీరాం ధర్నా… అంతకు ముందు ఏం జరిగింది?

మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం… అనంతపురంలో సాక్షి పత్రిక ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనుచరులతో కలిసి వచ్చి అక్కడ బైఠాయించారు. సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.

తమ కుటుంబంపై సాక్షి తప్పుడు కథనాలు రాస్తోందని పరిటాల శ్రీరాం ఆరోపించారు. పరిటాల శ్రీరాం ఇలా ధర్నా చేయడానికి కారణం… బుధవారం సాక్షి జిల్లా ఎడిషన్‌లో మంత్రి పరిటాల సునీతపై వచ్చిన కథనమే కారణం.

పరిటాల సునీత బంధువులు రాప్తాడు నియోజవకర్గంలోని ఒక్కో మండలాన్ని ఒక్కొక్కరు పంచుకుని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని సాక్షి పత్రిక కథనాన్ని రాసింది.

ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క పరిటాల సునీత నియోజక వర్గంలోనే మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని పత్రిక తన కథనంలో వివరించింది. పరిటాల కుటుంబానికి కప్పం కట్టనిదే ఏ పని జరడం లేదని వెల్లడించింది. ఈ కథనమే పరిటాల కుటుంబానికి కోపం తెప్పించింది.

తమపై అవినీతి ఆరోపణలు చేస్తూ కథనం రాయడాన్ని తప్పుపడుతూ పరిటాల శ్రీరాం అనుచరులతో కలిసి సాక్షి ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.