ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి… తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ స్వయంగా పార్టీ కోసం స్థలాన్ని పరిశీలించనున్నారు. నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి వెయ్యి గజాల స్థలం కేంద్రం కేటాయించే అవకాశం ఉంది. దీంతో పార్టీకి అనువైన స్థలాన్ని వెతికే పనిలో పడ్డారు.

స్థలం దొరికిన వెంటనే కేంద్ర అనుమతులు తీసుకొని సంక్రాంతి తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల లోపే కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.