Telugu Global
International

మౌంట్ అబూ.... స‌రిహ‌ద్దులో శాంతి మంత్రం

రాజ‌స్థాన్‌లో ఉన్న ఏకైక హిల్ స్టేష‌న్ మౌంట్ అబూ. కొండ మీద అర్బుదా దేవి ఆల‌యం ఉంది. ఆమె పేరు మీద‌నే ఈ ప్ర‌దేశానికి ఆ పేరు వ‌చ్చింది. అర్బుద అనే పేరు ఏళ్లు గ‌డిచేకొద్దీ వ్య‌వ‌హారికంలో అబూగా మారిపోయింద‌ని చెబుతారు. ఉత్త‌రాది వాళ్ల‌కు సంయుక్తాక్ష‌రాలు స‌రిగా ప‌ల‌క‌దు. దాంతో ఒక సంయుక్తాక్ష‌రాన్ని రెండు అక్ష‌రాలుగా అయినా ప‌లుకుతారు లేదా ఒక అక్ష‌రాన్ని మింగేస్తారు. ఆ క్ర‌మంలోనే అర్బుద అబూ అయింది. ఈ కొండ ప‌న్నెండు వంద‌ల […]

మౌంట్ అబూ.... స‌రిహ‌ద్దులో శాంతి మంత్రం
X

రాజ‌స్థాన్‌లో ఉన్న ఏకైక హిల్ స్టేష‌న్ మౌంట్ అబూ. కొండ మీద అర్బుదా దేవి ఆల‌యం ఉంది. ఆమె పేరు మీద‌నే ఈ ప్ర‌దేశానికి ఆ పేరు వ‌చ్చింది. అర్బుద అనే పేరు ఏళ్లు గ‌డిచేకొద్దీ వ్య‌వ‌హారికంలో అబూగా మారిపోయింద‌ని చెబుతారు.

ఉత్త‌రాది వాళ్ల‌కు సంయుక్తాక్ష‌రాలు స‌రిగా ప‌ల‌క‌దు. దాంతో ఒక సంయుక్తాక్ష‌రాన్ని రెండు అక్ష‌రాలుగా అయినా ప‌లుకుతారు లేదా ఒక అక్ష‌రాన్ని మింగేస్తారు.

ఆ క్ర‌మంలోనే అర్బుద అబూ అయింది. ఈ కొండ ప‌న్నెండు వంద‌ల మీట‌ర్ల ఎత్తులో ఉంది. అంటే దాదాపుగా మ‌న తిరుమ‌ల గిరులంత ఎత్త‌న్న మాట‌. ఈ కొండ కింద ఉన్న నివాస ప్ర‌దేశాన్ని కూడా అబూ అనే పిలుస్తారు.

కొండ మీద ప్ర‌దేశాన్ని మౌంట్ అబూ అంటారు. ఈ కొండ‌ దిల్‌వారా జైన్ టెంపుల్స్, అచ‌ల్‌ఘ‌ర్ ఫోర్ట్‌, అచ‌లేశ్వ‌ర్ ఆల‌యం, అర్బుదా దేవి ఆల‌యం ఉన్నాయి.

ఓం శాంతి!

మౌంట్ అబూ ఓ శాంతివ‌నంలా ఉంటుంది. టూరిస్టులు, ఓం శాంతి స‌న్యాసులు మాత్ర‌మే క‌నిపిస్తారు. వీళ్లు కాక నార్మ‌ల్ పీపుల్ క‌నిపించారంటే వాళ్లు టూరిజం ఆధారంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ల‌యి ఉంటారు. ఆ వ్యాపారుల ద‌గ్గ‌ర ఉద్యోగం చేసుకునే వాళ్ల‌యి ఉంటారు.

జ్ఞాన స‌రోవ‌ర్‌, పాండవ భ‌వ‌న్‌, పీస్ పార్క్ వంటివి ఓం శాంతి ఆధ్యాత్మిక కేంద్రాలు. జ్ఞాన్ స‌రోవ‌ర్‌లో ఓ థీమ్ పార్క్‌. దీనికి అనుబంధంగా విద్యాపీఠం కూడా ఉంది. దానికి పునాది వేసింది మ‌న స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి. అప్పుడాయ‌న రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్‌.

పీస్ పార్కు ప్ర‌శాంతంగా గ‌డ‌ప‌డానికి బావుంటుంది. టైమ్ బౌండ్‌తో చుట్టి వ‌స్తే పెద్దగా సంతృప్తి క‌ల‌గ‌దు. పీస్ పార్క్ దాటితే గురుశిఖ‌ర్ వ‌స్తుంది. ద‌త్తాత్రేయుని ఆల‌యం మెయిన్ అట్రాక్ష‌న్‌. అంత‌కంటే పెద్ద ఆక‌ర్ష‌ణ ఎత్తైన శిఖ‌రం నుంచి భూమిని చూడ‌డం.

దేశ స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నామ‌నే భావ‌న కూడా తెలియ‌ని పుల‌కింత‌ను క‌లిగిస్తుంది. అడుగ‌డుగునా బోర్డ‌ర్ సెక్యూరిటీ చెకింగ్‌లుంటాయి. సెక్యూరిటీ వాళ్లు క‌న‌ప‌డ‌గానే వాహ‌నాల డ్రైవ‌ర్లు కంగారుగా సీట్ బెల్టు పెట్టుకుంటారు. మౌంట్ అబూకి మ‌న హైద‌రాబాద్ కంటే పాకిస్తాన్ హైద‌రాబాద్ ద‌గ్గ‌ర‌.

నేచ‌ర్ స్పాట్స్‌

మౌంట్ అబూలో హ‌నీమూన్ స్పాట్ ఉంది. న‌క్కి లేక్ ఒక ప్రాకృతిక అద్భుతం. ప‌న్నెండు వంద‌ల మీట‌ర్ల ఎత్తులో ఇంత‌టి విశాల‌మైన నీటి స‌ర‌స్సు నిజంగా ఒక అద్భుత‌మే. ఇందులో బోట్ షికారు చేస్తే… నింగికీ- నేల‌కు మ‌ధ్య విహ‌రిస్తున్నామ‌నే భావ‌న గొప్ప‌గా ఉంటుంది. న‌క్కి లేక్‌ను చుట్టిన‌ట్లు ఉంటుంది రోడ్డు.

ఆ రోడ్డు వెంట ముందుకెళ్తే హ‌నీమూన్ స్పాట్‌కి చేరుకుంటాం. హ‌నీమూన్ స్పాట్‌లో కొండ రాయి ”ఒక అబ్బాయి అమ్మాయిని ఆలింగ‌నం చేసుకున్న సిల్‌హౌటీ”ని త‌ల‌పిస్తుంది. ఆ రాయి ద‌గ్గ‌ర‌కు వెళ్తే జంట ఏకాంతంగా కూర్చుని మౌంట్ అబూ ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని తిల‌కించ‌డానికి వీలుగా ఉంటుంది వ్యూ.

ఈ ప్ర‌దేశం నుంచి సూర్యాస్త‌మ‌యం చాలా అందంగా ఉంటుంది. సూర్యుడు త్రీడీ ఎఫెక్ట్‌లో మ‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తాడు. మౌంట్ అబూలో ఇది కాకుండా మ‌రో స‌న్‌సెట్ పాయింట్ కూడా ఉంది. గైడ్ స‌హాయంతో ప‌ర్య‌టించేట‌ప్పుడు దానిని కూడా అడిగి మ‌రీ చూడాలి.

రోడ్డు లేని ఆల‌యం

మౌంట్ అబూకి ఆ పేరు తెచ్చిన అర్బుదా దేవిని చూడాలంటే క‌నీసం రోడ్డు కూడా లేదు. మూడు వంద‌ల మెట్లు ఎక్కి ఆల‌యాన్ని చేరుకోవాలి.

ఆ చుట్టు ప‌క్క‌ల వాళ్లు నిత్యం వ‌చ్చి అమ్మ‌వారిని కొలుస్తూనే ఉంటారు. టూరిస్టుల‌కు అంత టైమ్ కేటాయించే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.

దిల్‌వారా ఆల‌యాల స‌మూహాన్ని చూడ‌డం మాత్రం త‌ప్ప‌నిస‌రి. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సినంత విస్త్రుత‌మైన ఆల‌యాల‌వి.

– మంజీర‌

First Published:  29 Dec 2018 1:46 AM GMT
Next Story