Telugu Global
NEWS

క్రీడారంగంలో మధుర జ్ఞాపకాల 2018

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా ఆసియాక్రీడల్లోనూ సత్తా చాటిన భారత్ క్రికెట్లో నంబర్ వన్ ర్యాంకర్ గా భారత్ హాకీలో ప్రపంచ 5వ ర్యాంక్ లో భారత్ బ్యాడ్మింటన్లో సింధు గోల్డెన్ షో ప్రపంచ బాక్సింగ్ లో మేరీ గోల్డ్ నాలుగుదేశాల ఫుట్ బాల్ విజేత భారత్ భారత్ కు గర్వకారణం నవతరం క్రీడాకారులు భారత క్రీడారంగ చరిత్రలో 2018వ సంవత్సరం.. అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ […]

క్రీడారంగంలో మధుర జ్ఞాపకాల 2018
X
  • కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా
  • ఆసియాక్రీడల్లోనూ సత్తా చాటిన భారత్
  • క్రికెట్లో నంబర్ వన్ ర్యాంకర్ గా భారత్
  • హాకీలో ప్రపంచ 5వ ర్యాంక్ లో భారత్
  • బ్యాడ్మింటన్లో సింధు గోల్డెన్ షో
  • ప్రపంచ బాక్సింగ్ లో మేరీ గోల్డ్
  • నాలుగుదేశాల ఫుట్ బాల్ విజేత భారత్
  • భారత్ కు గర్వకారణం నవతరం క్రీడాకారులు

భారత క్రీడారంగ చరిత్రలో 2018వ సంవత్సరం.. అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్ లతో పాటు…కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో సైతం నవతరం అథ్లెట్లు సత్తా చాటడం ద్వారా భారత క్రీడారంగానికి అంతర్జాతీయంగా గౌరవం తెచ్చారు. వివిధ క్రీడల్లో గత ఏడాదికాలంలో భారత్ సాధించిన ప్రగతి, పురోగతి ఏంటో ఓసారి చూద్దాం….

క్రీడారంగంలో నవోత్సాహం…

భారత్…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. అంతేకాదు…యువజన జనాభా ఎక్కువగా ఉన్న దేశం. వివిధ రంగాలలో భారత్ సాధించిన అసాధారణ విజయాల వెనుక… యువతరం పాత్ర ఎంతో ఉంది. గత ఏడాదికాలంలో క్రీడారంగంలో సైతం భారత్ సాధించిన బంగారుపతకాలు, రికార్డులు, విజయాల వెనుక నవతరం శ్రమ, అంకితభావం, కష్టం ఎంతో ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రమే కాదు…జకార్తా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో సైతం భారత నవతరం అథ్లెట్లు అసాధారణంగా రాణించారు. భారత క్రీడారంగానికి పలు మధురజ్ఞాపకాలను మిగిల్చారు.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా…

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 72 దేశాల కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు.తమ దేశానికి…పతకాలపట్టికలో సముచిత స్థానం కల్పించారు.

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 221 మంది అథ్లెట్లతో…15 రకాల క్రీడల బరిలోకి మాత్రమే దిగింది. అయితే…భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించడం ద్వారా… 26 స్వర్ణాలతో సహా మొత్తం 66 పతకాలు అందించారు. దీంతో భారత్ పతకాల పట్టిక మూడోస్థానంలో చోటు సంపాదించింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల తర్వాతిస్థానంలో నిలిపారు. బాక్సింగ్, షూటింగ్, మహిళల వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ విభాగాలలో భారత అథ్లెట్లు బంగారు పంట పండించారు.

ఆసియాక్రీడల్లోనూ జోరు…

2018 సంవత్సరంలో జరిగిన అతిపెద్ద క్రీడాసంబరం జకార్తా ఆసియాక్రీడల్లో సైతం…భారత అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించారు. ప్రధానంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు అథ్లెట్లు అరుదైన విజయాలతో దేశానికి వన్నె తెచ్చారు.

జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల్లో…567 మంది సభ్యుల భారీబృందంతో భారత్ పతకాల వేటకు దిగింది. 26 క్రీడాంశాలలో పాల్గొని 15 బంగారు పతకాలు సంపాదించింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళల విభాగంలో స్వప్న బర్మన్, హిమ దాస్, ద్యుతీ చంద్, పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా తిరుగులేని విజయాలతో సంచలనం సృష్టించారు.

వచ్చే ఒలింపిక్స్ లో పతకాలు సాధించడానికి తాము సిద్ధమని చెప్పకనే చెప్పారు. స్వర్ణపతకాలు సాధించడంతో భారత్ గణనీయమైన ప్రగతి సాధించినా…పతకాల పట్టికలో మాత్రం 8వ స్థానం మాత్రమే సంపాదించింది.

క్రికెట్లో టాప్ గేర్…..

ఇక…అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్లో మాత్రం…భారత్ నిలకడగా రాణిస్తూ…ప్రపంచ నంబర్ వన్ జట్టుగా తన ఆధిపత్యాన్ని చాటుకోడమే కాదు…స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగింది.

భారత్ లో క్రికెట్టే నంబర్ వన్ గేమ్.శతకోటి భారత క్రీడాభిమానులకు క్రికెట్ ను మించిన పిచ్చి మరొకటి లేదు. టెస్ట్ క్రికెట్లో మాత్రమే కాదు…యాభై ఓవర్ల వన్డే క్రికెట్లో సైతం భారత్ తిరుగులేని విజయాలతో సిరీస్ వెంట సిరీస్ గెలుచుకొంటూ…ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా నిలిచింది.

ఇంగ్లండ్ టూర్ లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా…టెస్ట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను మాత్రం కాపాడుకోగలిగింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ లో 31 పరుగులతో నెగ్గటమే కాదు… మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో సైతం ఆధిపత్యాన్ని చాటుకొంది.

కింగ్ విరాట్ కొహ్లీ…

క్రికెట్ వ్యక్తిగత విభాగంలో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డుల మోత మోగుతూనే ఉంది. పరుగులు, సెంచరీలు, విజయాలు…ఇలా ఏవిధంగా చూసినా…కొహ్లీనే ప్రపంచ మేటి ఆటగాడిగా సత్తా చాటుకొంటూ..తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు.

విరాట్ కొహ్లీ…ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు మార్మోగిపోతున్న ఏకైక పేరు. టెస్ట్ క్రికెట్…వన్డే క్రికెట్…టీ-20 క్రికెట్ ..ఫార్మాట్ ఏదైనా…పరుగుల సాధనలో విరాట్ కొహ్లీకి కొహ్లీ మాత్రమే సాటి.

గత ఏడాది కాలంలో…కొహ్లీ స్వదేశీ , విదేశీ సిరీస్ లు అన్నతేడాలేకుండా పరుగుల వెల్లువెత్తించాడు. ప్రస్తుత సిరీస్ లోని పెర్త్ టెస్ట్ వరకూ…2018 సీజన్లో ఏకంగా ఐదు టెస్ట్ శతకాలతో పాటు.. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

ఆస్ట్రేలియా గడ్డపైన సైతం అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా కొహ్లీ నిలిచాడు.

హర్మన్ ప్రీత్ మెరుపులు….

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ లో సైతం భారతజట్టు సత్తాచాటుకొంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో…వారేవ్వా అనిపించుకొంది.

ప్రపంచ క్రికెట్లో భారత పురుషులు మాత్రమే కాదు…మహిళలు సైతం సాధించగలరని..హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మహిళా జట్టు చాటి చెప్పింది. కరీబియన్ ద్వీపాలు వేదిగా జరిగిన మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భారత జట్టు ఆల్ విన్ రికార్డుతో టాపర్ గా నిలిచింది.

అంతేకాదు…భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో భారత మహిళల బ్యాటింగ్ పవర్ ఏపాటిదో చాటి చెప్పింది. వెటరన్ మిథాలీ రాజ్ సైతం…టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది.

హాకీలో మిశ్రమఫలితాలు….

జాతీయ క్రీడ హాకీలో మాత్రం…భారత్ పరిస్థితి నాలుగడుగులు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ప్రపంచ మొదటి ఐదు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ నిలిచింది.

భారత హాకీజట్టు….పురుషుల ర్యాంకింగ్స్ లో 5వ స్థానం సాధించినా…నిలకడలేమితో మిశ్రమఫలితాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో 4వ స్థానంతో సరిపెట్టుకొన్న భారత్.. ఆసియాక్రీడల హాకీలో కాంస్యం సంపాదించింది.

భువనేశ్వర్ వేదికగా ముగిసిన 2018 ప్రపంచకప్ హాకీలో సైతం భారత్ పతకం ఆశలు రేపినా…క్వార్టర్స్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్ లీగ్ దశలో ఆల్ విన్ రికార్డు సాధించిన భారత జట్టు…. సెమీఫైనల్లో చోటు కోసం జరిగిన పోటీలో…హాలెండ్ చేతిలో ఓటమి పొందక తప్పలేదు. 16 దేశాల జట్లు తలపడిన ప్రపంచకప్ టోర్నీని భారత్ 6వ స్థానంతో ముగించాల్సి వచ్చింది.

బ్యాడ్మింటన్ లో సింధు, సైనా షో….

బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో భారత్ కు చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా…మహిళల విభాగంలో మాత్రం వెటరన్ సైనా, తెలుగు తేజం పీవీ సింధు గొప్ప విజయాలే సాధించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్లో…కిడాంబీ శ్రీకాంత్ గత ఏడాది కాలంలో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యాడు. అయితే మహిళల విభాగంలో …వెటరన్ సైనా నెహ్వాల్…కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ తో పాటు.. ఆసియాక్రీడల కాంస్య పతకం సాధించి…తనలో వాడివేడీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

తెలుగుతేజం, 3వ ర్యాంకర్ సింధు మాత్రం…ఆరు ప్రధాన టోర్నీలలో రజత పతకాలు సాధించినా…సీజన్ ఆఖరి టోర్నీగా జరిగిన ప్రపంచ టూర్ ఫైనల్స్ లో …స్వర్ణ పతకం సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలిమహిళగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఎవర్ గ్రీన్ మేరీ గోల్డ్…..

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్…మరోసారి తనసత్తా ఏపాటిదో చాటి చెప్పింది. న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచింది. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని తన విజయం ద్వారా నిరూపించింది.

ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం , గుర్తింపు సంపాదించుకొంది. ఏడు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొని ఆరు బంగారుపతకాలు సాధించిన… ఏకైక బాక్సర్ గా చరిత్ర సృష్టించింది. ముగ్గురు బిడ్డల తల్లిగా ఆరవ ప్రపంచ స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఫుట్ బాల్ లో షరామామూలే….

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో సైతం…గత ఏడాది కాలంలో భారత్ మెరుగైన ఆటతీరే ప్రదర్శించింది. నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను మెరుగుపరచుకోగలిగింది.

గ్లోబల్ గేమ్ ఫుట్ బాల్ లో…సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత ఫుట్ బాల్ జట్టు గణనీయమైన విజయాలు, అబ్బురపరచే ప్రగతి సాధించింది. ముంబై వేదికగా ముగిసిన నాలుగుదేశాల ఫుట్ బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది.

క్రికెట్, హాకీ, షూటింగ్, ఫుట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, ట్రాక్ అండ్ ఫీల్డ్…ఇలా క్రీడలు ఏవైనా…భారత్ లోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు… బంగారు పతకాలు సాధించి…తమదేశానికి వన్నె తెచ్చారు. వచ్చే ఒలింపిక్స్ లో దేశానికి ఏదో ఒక పతకం సాధించే సత్తా, తెగువ తమలో ఉన్నాయని…2018 సీజన్లో సాధించిన విజయాలతో చాటి చెప్పారు.

First Published:  31 Dec 2018 4:00 AM GMT
Next Story