Telugu Global
NEWS

కుంభస్థలం పైనే కొట్టే యోచనలో జనసేన

జనసేన ప్రతి అడుగును వ్యూహాత్మకంగా వేస్తోంది. రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకోకుండా ముందుకెళ్లడం వల్ల ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న నేపథ్యంలో జనసేన మాత్రం ఓర్పుతో అధికార పీఠం కోసం మాటువేస్తోంది. ఎక్కడ నెగ్గాలో…. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన పవన్‌కల్యాణ్…. 2019 ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు. తాను తక్షణ అధికారం కోసం రాలేదని… 25 ఏళ్ల పాటు రాజకీయం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం బట్టే ఆయన దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా […]

కుంభస్థలం పైనే కొట్టే యోచనలో జనసేన
X

జనసేన ప్రతి అడుగును వ్యూహాత్మకంగా వేస్తోంది. రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకోకుండా ముందుకెళ్లడం వల్ల ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న నేపథ్యంలో జనసేన మాత్రం ఓర్పుతో అధికార పీఠం కోసం మాటువేస్తోంది. ఎక్కడ నెగ్గాలో…. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన పవన్‌కల్యాణ్…. 2019 ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు.

తాను తక్షణ అధికారం కోసం రాలేదని… 25 ఏళ్ల పాటు రాజకీయం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం బట్టే ఆయన దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఒకవైపు వైఎస్‌, మరోవైపు చంద్రబాబు నిలబడి పోరుకు సిద్ధమైన వేళ చిరంజీవి పార్టీ పెట్టేందుకు అది సరైన సమయం కాదని డీఎస్‌ లాంటి వారు సూచించారు. కానీ చిరంజీవి పార్టీ పెట్టి వైఎస్‌, చంద్రబాబు ల మధ్య జరిగిన పోరులో నలిగిపోయారు.

ఇప్పుడు పరిస్థితి ఏపీలో అదే తరహాలో ఉంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్‌ తీవ్రస్థాయిలో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన ఇంకా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదు. ఎన్నికలు మరో మూడు నాలుగు నెలల్లో రాబోతున్నప్పటికీ ఇంకా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన సీనియర్లు పవన్ కల్యాణ్‌ వద్ద కొత్త ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

విమర్శలు వచ్చినా సరే 2019 ఎన్నికలకు జనసేన దూరంగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన చేయాల్సిందిగా పవన్‌కు సీనియర్లు సూచించారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ లలో ఏ పార్టీ ఓడిపోయినా… అలా ఓడిపోయిన పార్టీ కోలుకునే అవకాశం ఉండదని…. అప్పుడు జనసేన విజృంభించి పనిచేస్తే 2024 నాటికి జనసేన అధికార పీఠానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్న వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారు.

ప్రస్తుతం సర్వేలు చెబుతున్న దాని బట్టి చూస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని…అదే జరిగితే ఇప్పటికే వయసు రిత్యా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు చురుగ్గా పనిచేసే పరిస్థితి ఉండదని… లోకేష్‌ చేతుల్లోకి టీడీపీ వెళ్తే మరింత బలహీన పడుతుందని… ఆ సమయంలో ప్రజల తరపున జనసేన గట్టిగా పోరాటం చేస్తే 2024లో అధికార పీఠం సులువుగా కైవసం అవుతుందని సీనియర్లు తమ ఆలోచనను పార్టీ అధినేత వద్ద పంచుకుంటున్నారు.

మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే పీఆర్పీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయని…2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో అంతుచిక్కని పరిస్థితి ఉంది. కాబట్టి 2019 ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ స్థానాలను మాత్రమే గెలుచుకుంటే పార్టీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుందని జనసేన మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కాబట్టి 2019 ఎన్నికలకు దూరంగా ఉండి… ఓర్పుగా నిలబడితే టీడీపీ, వైసీపీ లలో ఏదో ఒక పార్టీ పూర్తిగా బలహీన పడే అవకాశం ఉంటుందని… అప్పుడు ఆ ప్రత్యామ్నాయ స్థానాన్ని జనసేన ఆక్రమించవచ్చని వివరిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై పవన్‌ కల్యాణ్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

First Published:  31 Dec 2018 12:40 AM GMT
Next Story