Telugu Global
NEWS

పాపకు పాలిచ్చిన కానిస్టేబుల్ ప్రియాంక, క్షేమంగా తల్లి ఒడికి.... సన్మానించిన కమిషనర్

ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో… తెలంగాణ పోలీసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని, కష్టంతో తమ వద్దకు వచ్చిన వారిని మానవీయ కోణంలో ఆదుకుంటూ పోలీసులది రాతి గుండె కాదని చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ప్రియాంక దంపతులు చేసిన పని అందరి మన్ననలు పొందింది. కమిషనరే స్వయంగా ప్రియాంక దంపతులను సన్మానించారు. హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రియాంక ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నారు. ఆమె భర్త రవీంద్ర కూడా కానిస్టేబుల్‌గానే పనిచేస్తున్నారు. రవీంద్ర పనిచేస్తున్న అప్జల్‌గంజ్‌ […]

పాపకు పాలిచ్చిన కానిస్టేబుల్ ప్రియాంక, క్షేమంగా తల్లి ఒడికి.... సన్మానించిన కమిషనర్
X

ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో… తెలంగాణ పోలీసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని, కష్టంతో తమ వద్దకు వచ్చిన వారిని మానవీయ కోణంలో ఆదుకుంటూ పోలీసులది రాతి గుండె కాదని చాటుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ప్రియాంక దంపతులు చేసిన పని అందరి మన్ననలు పొందింది. కమిషనరే స్వయంగా ప్రియాంక దంపతులను సన్మానించారు.

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రియాంక ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నారు. ఆమె భర్త రవీంద్ర కూడా కానిస్టేబుల్‌గానే పనిచేస్తున్నారు.

రవీంద్ర పనిచేస్తున్న అప్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌కు రాత్రి కొందరు వచ్చి ఒక రెండు నెలల పాపను అప్పగించారు. ఒక మహిళ కాసేపట్లో వస్తానని చెప్పి పాపను చేతిలో పెట్టి వెళ్లిపోయిందని వారు వివరించారు.

అప్పటికే ఆకలితో ఉన్న రెండు నెలల పాప ఏడవడం మొదలుపెట్టింది. పోలీసులకూ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో కానిస్టేబుల్ రవీంద్ర తన భార్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు.

వెంటనే ప్రియాంక ఆటోలో అప్జల్‌గంజ్ పీఎస్‌ కు వచ్చారు. పాప ఎందుకు ఏడుస్తోందో ఒక తల్లిగా అర్థం చేసుకుంది. వెంటనే తానే స్వయంగా పాలిచ్చింది. పాప ఏడుపు ఆగిపోయింది.

ఇక ఆ పాప తల్లి ఎవరన్నది పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతలో ఒక మహిళ చంచల్‌గూడ ప్రాంతంలో తన పాప కనిపించడం లేదని ఏడుస్తుండడాన్ని స్థానిక పోలీసులు గమనించారు. తన పాప ఎలా మిస్‌ అయింది వివరించిందామె.

మద్యం మత్తులో తన పాపను ఎవరికో ఇచ్చేశానని… ఆ తర్వాత వారిని గుర్తు పట్టలేకపోయానని వాపోయింది. దీంతో ఆమెను అప్జల్‌గంజ్ పీఎస్‌కు తీసుకెళ్లి ఆ బిడ్డ ఆమె బిడ్డేనని నిర్ధారించుకున్న తర్వాత పాపను అప్పగించారు.

రాత్రి వేళ అయినప్పటికీ పాప ఆకలి తీర్చేందుకు రవీంద్ర, ప్రియాంక దంపతులు చూపిన చొరవను కమిషనర్ అంజనీ కుమార్‌ ప్రశంసించారు. దంపతులకు సన్మానం చేసి, రివార్డు ప్రకటించారు. తాము చేసిన దాంట్లో గొప్ప విషయం ఏమీ లేదని… తాను కూడా ఒక బిడ్డకు తల్లిని కాబట్టే పాప ఎందుకు ఏడుస్తోందో గుర్తించి పాలిచ్చానని ప్రియాంక చెప్పారు.

First Published:  1 Jan 2019 5:00 AM GMT
Next Story