Telugu Global
CRIME

చనిపోయిన భిక్షగాడి కాలిలో భారీగా నగదు

బెంగళూరులో భిక్షాటన చేసి బతికే ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బు బయటపడింది. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. 75 ఏళ్ల షరీఫ్‌ సాద్‌ చాలా ఏళ్లుగా బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఇతడి స్వస్థలం హైదరాబాద్‌. బెంగళూరు వచ్చి ఇక్కడే భిక్షాటన చేస్తుండేవాడు. అయితే ఏమైందో గానీ షరీష్‌ ఉదయం రైల్వే స్టేషన్‌ వద్ద రోజూ తాను భిక్షాటన చేసే స్థలంలో పడిపోయి ఉన్నాడు. వెంటనే ప్రయాణికులు రైల్వే పోలీసులకు […]

చనిపోయిన భిక్షగాడి కాలిలో భారీగా నగదు
X

బెంగళూరులో భిక్షాటన చేసి బతికే ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బు బయటపడింది. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. 75 ఏళ్ల షరీఫ్‌ సాద్‌ చాలా ఏళ్లుగా బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఇతడి స్వస్థలం హైదరాబాద్‌. బెంగళూరు వచ్చి ఇక్కడే భిక్షాటన చేస్తుండేవాడు. అయితే ఏమైందో గానీ షరీష్‌ ఉదయం రైల్వే స్టేషన్‌ వద్ద రోజూ తాను భిక్షాటన చేసే స్థలంలో పడిపోయి ఉన్నాడు.

వెంటనే ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే షరీఫ్ చనిపోయి ఉన్నాడు. శవాన్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతడి కాలు చాలా బరువుగా అనిపించింది. నిజానికి షరీఫ్‌కు ఒక కాలు లేదు. కృత్తిమ కాలు పెట్టుకుని తిరిగేవాడు.

బరువుగా ఉండడంతో ఆ కాలును పరిశీలించగా… అందులో నోట్ల చుట్టలు కనిపించాయి. 500 రూపాయల నోట్లు 42, వంద రూపాయల నోట్లు 470, రెండు వందల రూపాయల నోట్లు 20 ఉన్నాయి. 50 రూపాయల నోట్లు 215, ఇరవై రూపాయల నోట్లు 430 కనిపించాయి. ఇలా కృత్తిమ కాలిలో ఉన్న సొమ్ము మొత్తం 96వేల 760 రూపాయలు.

అక్కడే భిక్షాటన చేసే వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా షరీఫ్‌ సోదరి హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించామని… ఆమెకు కబురు పెట్టామని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన షరీష్‌ స్థానికంగా హోటల్స్‌లో భోజనం చేసి… రైల్వే స్టేషన్ వద్దే నిద్రించేవాడు. భిక్షాటనలో వచ్చిన డబ్బును తన కాలిలోనే దాచుకునే వాడని పోలీసులు గుర్తించారు.

First Published:  2 Jan 2019 5:46 AM GMT
Next Story