Telugu Global
NEWS

కేసీఆర్ కు ఈటెల దూరంగా.... శ్రీధర్ బాబు దగ్గరగా....

సీఎం కేసీఆర్ రెండో సారి అఖండ మెజార్టీతో గద్దెనెక్కగానే టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై గట్టి పట్టు సాధించారు. అందుకే ఈసారి మంత్రి పదవులు, పార్టీ పదవులపై దీర్ఘ దృష్టితో ఆలోచిస్తున్నారు. ఎలా పడితే అలా.. ఎవరికి పడితే వారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదు. తాజాగా కేసీఆర్ గద్దెనెక్కగానే ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలోనే పూర్తి చేయడానికి సంకల్పించారు. అందుకే కరీంనగర్ పూర్వపు జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును వరుసగా రెండో రోజు బుధవారం […]

కేసీఆర్ కు ఈటెల దూరంగా.... శ్రీధర్ బాబు దగ్గరగా....
X

సీఎం కేసీఆర్ రెండో సారి అఖండ మెజార్టీతో గద్దెనెక్కగానే టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై గట్టి పట్టు సాధించారు. అందుకే ఈసారి మంత్రి పదవులు, పార్టీ పదవులపై దీర్ఘ దృష్టితో ఆలోచిస్తున్నారు. ఎలా పడితే అలా.. ఎవరికి పడితే వారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదు.

తాజాగా కేసీఆర్ గద్దెనెక్కగానే ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలోనే పూర్తి చేయడానికి సంకల్పించారు. అందుకే కరీంనగర్ పూర్వపు జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును వరుసగా రెండో రోజు బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీలలో కారులో వెళుతూ ఆగి మరీ తీక్షణంగా పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

కాగా కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ మొదటి రోజు కాళేశ్వరం పర్యటించి కరీంనగర్ లోని తెలంగాణ భవన్ లో బస చేశారు. కేసీఆర్ వెంట కరీంనగర్ పూర్వపు జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఉన్నా ఒక్కరు మాత్రం కనిపించలేదు. ఆయనే హుజారాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఆయన కేసీఆర్ వెంట కాళేశ్వరం ప్రాజెక్టుల వద్ద లేరు…. తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలవడానికి రాలేదు…. ఇటీవల ఈటెలను స్పీకర్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన నొచ్చుకున్నారనే వార్తలొచ్చాయి. బహుశా అలిగి కేసీఆర్ వచ్చినా కలవలేదనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఆశ్చర్యకరంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట కాళేశ్వరంలో మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఉండడం విశేషంగా చెప్పవచ్చు. శ్రీధర్ బాబు దగ్గరుండి మరీ అన్నీ కేసీఆర్ కు వివరించారు. శ్రీధర్ బాబు త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ బాబు కూడా కాంగ్రెస్ ను వీడబోతున్నారని.. కేసీఆర్ తో ఈ విషయం గురించి మాట్లాడారని వార్తలొస్తున్నాయి.

కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకొని వచ్చే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండనుండడంతో శ్రీధర్ బాబు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రీధర్ బాబు మాత్రం స్పందించ లేదు.

First Published:  2 Jan 2019 4:45 AM GMT
Next Story