Telugu Global
National

స్పితి లోయ‌.... స‌రిహ‌ద్దు విహారం

స్పితిలోయ మ‌న‌దేశానికి ఉత్త‌ర స‌రిహ‌ద్దులో చైనా-టిబెట్ పొలిమేర‌లో ఉంది. స్పితి అంటే మ‌ధ్య‌నున్న నేల అని అర్థం. హిమాల‌య సానువుల్లో విస్త‌రించిన ప్ర‌దేశం ఇది. ఈ లోయ‌తోపాటు ఇక్క‌డ ప్ర‌వ‌హిస్తున్న న‌ది కూడా అదే పేరుతో ”స్పితి న‌ది”గా వాడుక‌లోకి వ‌చ్చింది. బౌద్ధం కొలువుదీరిన ప్ర‌దేశం ఇది. బౌద్ధ లామాలు తిరిగే నేల‌. ప‌ర్వ‌త సానువుల్లో క్లిష్ట‌మైన మ‌లుపులు తిరుగుతూ ముందుకు పోతుంటే ఇక్క‌డ మ‌నుషులు నివ‌సించ‌డం సాధ్య‌మైనా అనే సందేహం క‌లుగుతుంది. క‌ట్ట‌డాలంటే బౌద్ధారామాలు, చైత్యాలు […]

స్పితి లోయ‌.... స‌రిహ‌ద్దు విహారం
X

స్పితిలోయ మ‌న‌దేశానికి ఉత్త‌ర స‌రిహ‌ద్దులో చైనా-టిబెట్ పొలిమేర‌లో ఉంది. స్పితి అంటే మ‌ధ్య‌నున్న నేల అని అర్థం. హిమాల‌య సానువుల్లో విస్త‌రించిన ప్ర‌దేశం ఇది. ఈ లోయ‌తోపాటు ఇక్క‌డ ప్ర‌వ‌హిస్తున్న న‌ది కూడా అదే పేరుతో ”స్పితి న‌ది”గా వాడుక‌లోకి వ‌చ్చింది. బౌద్ధం కొలువుదీరిన ప్ర‌దేశం ఇది. బౌద్ధ లామాలు తిరిగే నేల‌.

ప‌ర్వ‌త సానువుల్లో క్లిష్ట‌మైన మ‌లుపులు తిరుగుతూ ముందుకు పోతుంటే ఇక్క‌డ మ‌నుషులు నివ‌సించ‌డం సాధ్య‌మైనా అనే సందేహం క‌లుగుతుంది. క‌ట్ట‌డాలంటే బౌద్ధారామాలు, చైత్యాలు మాత్ర‌మే క‌నిపిస్తాయి. కాషాయ‌ధారులైన బౌద్ధులు క‌నిపిస్తాయి. కొండ‌దారుల్లో న‌డ‌వ‌డం వారి దిన‌చ‌ర్య కావ‌డంతో ఏ మాత్రం తొట్రుప‌డ‌కుండా ఒక‌రి వెనుక న‌డుస్తుంటారు.

ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ కార‌ణంగా బాగాఎత్తుకి వెళ్తున్నామ‌ని మాత్రం తెలుస్తుంటుంది. ఎంత ఎత్తులో ఉన్నామ‌ని తెలియ‌దు. ఎటు చూసినా ప‌ర్వ‌త శిఖ‌రాలే, చ‌దునైన నేల క‌నిపించ‌దు. మైలురాళ్లలాగ ఎత్తును తెలిపే బోర్డులు ఎక్క‌డో ఒక‌టి క‌నిపిస్తాయి.

స్పితిలోయ స‌ముద్ర మ‌ట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఉంది. చిన్న‌ప్పుడు సోష‌ల్ పాఠంలో అర్థం కాక‌పోయినా బ‌ట్టీ ప‌ట్టి ప‌రీక్ష రాసేసిన కీ మోనాస్ట్రీ, తాబో మోనాస్ట్రీలు స్పితిలోయ‌లోనే ఉన్నాయి. ఇక్క‌డి క‌ట్ట‌డాలు బౌద్ధం పురుడు పోసుకున్న కాలం నాటివి. స్పితిలోయ ద‌లైలామాకు ఇష్ట‌మైన ప్ర‌దేశం.

కులూ నుంచి స్పితికి దారి

స్పితి లోయ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అన‌గానే మొద‌ట‌గా గుర్తు వ‌చ్చేవి సిమ్లా, కులు, మ‌నాలి. స్పితిలోయకు వెళ్లాలంటే కులు నుంచే వెళ్లాలి. స్పితిలోయ‌కు వెళ్లే దారిలోనే రొహ‌తాం పాస్ వ‌స్తుంది. రొహ‌తాంగ్ పాస్ దాటిన త‌ర్వాత ఓ ప‌క్క‌గా కుంజుమ్ క‌నుమ క‌నిపిస్తుంది.

హిమాల‌యాల నుంచి క‌రిగిన మంచు కుంజుమ్ క‌నుమ మీదుగా ప్ర‌వ‌హించి ప‌ల్లానికి చేరుతుంది. ఆ నీరు ఒక చోట మ‌డుగు క‌ట్టి న‌ది రూపం సంత‌రించుకుంటుంది. అదే స్పితి న‌ది. ఆ లోయ‌నే స్పితి లోయ అంటారు.

అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్ ఏది?

దీనికి స‌మాధానం స్పితి ప‌ర్య‌ట‌న‌లో దొరుకుతుంది. ఆ పోస్టాఫీస్ ఉన్నఊరి పేరు హిక్కిమ్‌. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం, స్పితి జిల్లా, హిక్కిమ్ పోస్టాఫీస్ అనేది పూర్తి స‌మాధానం. ఈ పోస్టాఫీస్ పిన్‌కోడ్ 172114. ఈ పోస్టాఫీస్‌కు సంబంధించిన ఇంకా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ఉంది. ఈ చిన్న ప‌ట్ట‌ణంలో జ‌నాభా ఆరు వంద‌లు.

మ‌న ద‌గ్గ‌ర ఆరువంద‌లంటే చిన్న గ్రామంగా ప‌రిగ‌ణిస్తాం. ఈ కొండ ప్ర‌దేశంలో అది ప‌ట్ట‌ణ‌మే. ఈ ఆరువంద‌ల మందిలో యాభై మందికి పైగా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి.

పోస్టాఫీస్ ద్వారా లావాదేవీలు ఇక్క‌డ ఎక్కువ‌. ఉత్త‌రాలు రోజుకు ఇర‌వై వ‌ర‌కు బ‌ట్వాడా అవుతాయి. ఈ ప‌ట్ట‌ణానికి మాత్రం మోటార్ వాహ‌నాలు న‌డిచే రోడ్డు ఉంది.

ప్ర‌పంచంలో ఎత్తైన నివాస ప్ర‌దేశం ఏది?

దీనికి ఆన్స‌ర్ కూడా స్పితి ట్రిప్‌లోనే దొరుకుతుంది. చ‌టుక్కున హిక్కిమ్ అనేస్తే పొర‌పాటే. హిక్కిమ్ కంటే ఎత్తులో ఉంది గెట్టె గ్రామం. అది 4270 మీట‌ర్ల ఎత్తులో ఉంది. ఈ టూర్‌లో మ‌రో అట్రాక్ష‌న్ బారా సిగ్రి గ్లేసియ‌ర్‌.

ఈ గ్లేసియ‌ర్ ప్ర‌పంచంలో పొడ‌వైన హిమ‌నీన‌దం. ఇలా ప్ర‌శ్న‌లు వేసుకుంటూ జ‌వాబులు వెతుక్కోవ‌డానికి కాంపిటిటీవ్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్నామా ఆహ్లాదంగా టూర్‌కి వెళ్తున్నామా… అనిపిస్తుంటే పొర‌పాటే. మ‌నం చూసిన ప్ర‌దేశానికి ఉన్న ప్ర‌త్యేక‌త‌ను తెలుసుకుని చూస్తే ఆ టూర్‌లో ఉండే థ్రిల్ వేరు.

ధ‌ర్మ‌రాజు కోసం ఇంద్రుని ర‌థం

ఇప్ప‌టి వ‌ర‌కు స్పితిలోయ‌కు బౌద్ధానికి ఉన్న బంధాన్ని మాట్లాడుకున్నాం. ఈ ప్ర‌దేశానికి మ‌హాభార‌తానికి ఉన్న సంబంధం కూడా ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. కుంజుం క‌నుమ‌కు ఆరు కిలోమీట‌ర్ల దూరంలో చంద‌ర్‌తాల్ ఉంది.

ఇది చంద్ర న‌ది ప‌రివాహ‌క ప్ర‌దేశం. ఇక్క‌డ చంద్ర న‌ది పాయ‌గా చీలి చిన్న మ‌డుగు క‌ట్టి ఉంటుంది. ఆ మ‌డుగుకి చంద‌ర్ తాల్ అని పేరు. ధ‌ర్మ‌రాజు స్వ‌ర్గానికి వెళ్ల‌డానికి ప్ర‌యాణ‌మై నడుస్తూన్న‌ప్పుడు చంద‌ర్ తాల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి ఇంద్రుడు పంపిన ర‌థం ఎదురు ప‌డింద‌ని చెబుతారు.

ధ‌ర్మ‌రాజు ర‌ధాన్ని అధిరోహించిన ప్ర‌దేశం చంద‌ర్‌తాల్ అని స్థానికుల‌ విశ్వాసం. కుంజుమ్ పాస్‌, రొహ‌తాంగ్ పాస్‌ల‌ను చూసేసి లోసార్‌లో స‌ర‌దాగా జ‌డ‌ల బ‌ర్రెలు, పొట్టి గుర్రాల మీద స‌వారీ చేస్తూ హిమాల‌యాల సౌంద‌ర్యాన్ని వీక్షించ‌వ‌చ్చు.

-మంజీర‌

First Published:  1 Jan 2019 9:40 PM GMT
Next Story