అంతిమ యాత్రలో గురువు పాడె మోసిన సచిన్…. ఆశ్రునయనాల మధ్య అచ్రేకర్ అంత్యక్రియలు

భారత రత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ ముంబైలో అచ్రేకర్ అంత్యక్రియలు వేలాది మంది అభిమానుల సమక్షంలో అశ్రునయనాల మధ్య జరిగాయి.

అంతకు మునుపు అచ్రేకర్ అంతిమ యాత్రలో సచిన్ పాల్గొని గురువు పాడె మోసి రుణం తీర్చుకున్నారు. అంతిమ యాత్ర ఆసాంతం వెక్కి వెక్కి ఏడుస్తూ బాధాతప్త హృదయంతో గురువును సాగనంపాడు.

అంతకు మునుపు శివాజీ పార్క్‌లో అచ్రేకర్ మృత దేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. రమాకాంత్ వద్ద శిక్షణ తీసుకున్న వేలాది మంది క్రికెటర్లు ఆయనకు అంతిమ నివాళి అర్పించడానికి వచ్చారు.

శివాజీ పార్క్ నుంచి బయలు దేరిన అంతిమ యాత్రలో సచిత్‌తో సహా వినోద్ కాంబ్లీ, వినోద్కర్, బల్విందర్ సంధూ, చంద్రకాంత్ పండిట్, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే, ముంబై మేయర్ విశ్వనాథ్ మహాదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.