Telugu Global
NEWS

ఈ బెంగాల్ మ‌హిళ‌.... విమానం ఎక్కిన తొలి భార‌తీయురాలు

మ‌న‌దేశంలో విమానం ఎక్కిన తొలి భార‌తీయురాలు ఎవ‌రు? ఇది జికె టెస్ట్ కాదు. కానీ ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మే. ఒక మ‌హిళ పైల‌ట్ అయిన‌ప్పుడు ప్ర‌త్యేక క‌థ‌నాలు వ‌స్తాయి ప‌త్రిక‌ల్లో. విమానం న‌డిపిన‌ప్పుడు, యుద్ధ విమానాల‌ను న‌డిపిన‌ప్పుడు ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతుంటాయి. అప్ప‌ట్లో … అంటే ఓ వందేళ్ల‌కంటే ముందు… ఒక మ‌హిళ విమానం ఎక్క‌డ‌మే అతి పెద్ద సాహ‌సం. అందుకే అది రికార్డు అయింది. అప్ప‌టి ముఖ్య‌మైన ప‌త్రిక‌ల‌న్నీ ఆమె సాహ‌సాన్ని ఫొటోల‌తో ప్ర‌చురించాయి. ఆమె […]

ఈ బెంగాల్ మ‌హిళ‌.... విమానం ఎక్కిన తొలి భార‌తీయురాలు
X

మ‌న‌దేశంలో విమానం ఎక్కిన తొలి భార‌తీయురాలు ఎవ‌రు? ఇది జికె టెస్ట్ కాదు. కానీ ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మే. ఒక మ‌హిళ పైల‌ట్ అయిన‌ప్పుడు ప్ర‌త్యేక క‌థ‌నాలు వ‌స్తాయి ప‌త్రిక‌ల్లో. విమానం న‌డిపిన‌ప్పుడు, యుద్ధ విమానాల‌ను న‌డిపిన‌ప్పుడు ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతుంటాయి.

అప్ప‌ట్లో … అంటే ఓ వందేళ్ల‌కంటే ముందు… ఒక మ‌హిళ విమానం ఎక్క‌డ‌మే అతి పెద్ద సాహ‌సం. అందుకే అది రికార్డు అయింది. అప్ప‌టి ముఖ్య‌మైన ప‌త్రిక‌ల‌న్నీ ఆమె సాహ‌సాన్ని ఫొటోల‌తో ప్ర‌చురించాయి. ఆమె పేరు మ్రుణాళినీ దేవి సేన్‌. రాజ‌కుటుంబానికి చెందిన మ్రుణాళిని క‌వ‌యిత్రి కూడా.

భాగ‌ల్‌పూర్ అమ్మాయి

మ్రుణాళినీ దేవి పుట్టింది భాగ‌ల్‌పూర్ (ఇప్పుడు బీహార్ రాష్ట్రం) రాజాస్థానం. ఆమెకు ప‌న్నెండేళ్ల‌కే పెళ్ల‌యింది. బెంగాల్‌లోని పైకాపురా రాజ‌కుమారుడితో జ‌రిగింది వివాహం. అయితే అత‌డు 27 ఏళ్ల‌కే మ‌ర‌ణించాడు. అలా పాతికేళ్ల లోపే వితంతువుగా అయింది మ్రుణాళిని. అప్ప‌టికి ఆమెకు పిల్ల‌లు లేరు.

కొన్నేళ్ల‌కు రాజ‌కుటుంబీకుల వేడుక‌ల్లో నిర్మ‌ల్ చంద్ర‌సేన్‌తో ప‌రిచ‌య‌మైందామెకు. నిర్మ‌ల్‌ది కూడా బెంగాలే. అత‌డి తండ్రి కేశ‌భ్ చంద్ర‌సేన్ సంఘ‌సంస్క‌ర్త‌. బ్ర‌హ్మ‌సమాజం సిద్ధాంతాల‌ను ప్ర‌చారం చేసేవారు. స‌తి దురాచారాన్ని ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌వంతం చేసేవారు. మ్రుణాళిని సోద‌రుడి చొర‌వ‌తో ఆమెకు నిర్మ‌ల్‌తో పెళ్ల‌యింది. ఈ దంప‌తుల‌కు ముగ్గుర‌మ్మాయిలు. ఒక అబ్బాయి. మ్రుణాళిని త‌న బ‌యోగ్ర‌ఫీలో విమానం ఎక్కిన నాటి సంగ‌తుల‌ను ఇలా రాసుకున్నారు…

”అది 1910, డిసెంబ‌ర్ 19వ తేదీ. శీతాకాలం. బెల్జియం నుంచి కోల్‌క‌తాకి ఇద్ద‌రు పైల‌ట్లు వ‌చ్చారు. ఇద్ద‌రూ రెండు చిన్న విమానాలను న‌డుపుకుంటూ వ‌చ్చారు. వారిలో ఒక‌రి పేరు బారోన్ డే కేట‌ర్‌. అతడి విమానం ఇద్ద‌రు కూర్చోగ‌లిగిన‌ది. మ‌రో వ్య‌క్తి మాన్‌షూర్ టైక్‌. అత‌డిది ఒక్క‌రు కూర్చునే విమానం.

వాళ్లు విమానాల‌ను మైదానంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. వేలాదిమంది తండోప‌ తండాలుగా వ‌చ్చారు. పైల‌ట్‌ల‌తోపాటు ఒక ఇంగ్లిష్ వ్య‌క్తి కూడా వ‌చ్చాడు. అత‌డు ఎంట్ర‌ప్రెన్యూర్‌, గైడ్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. విమానం ఎక్కితే ఉచితంగా తిప్పుతామ‌ని ప్ర‌జ‌ల్ని ఆహ్వానించారు. ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. అప్పుడు నా భ‌ర్త ”నువ్వు వెళ్తావా” అని అడిగారు. నేను వెంట‌నే వెళ్లిపోయాను.

బారోన్ డే కేట‌ర్ త‌న విమానంలో న‌న్ను ఆకాశంలోకి తీసుకెళ్లారు. కొంత సేపు ఫ్ల‌య్ అయిన త‌ర్వాత దించారు. ఆ విమానం అంతా ఓపెన్‌గా ఉంది. చిన్న షేడ్ మాత్ర‌మే ఉంది. ప‌డిపోకుండా రాడ్‌లు ప‌ట్టుకుని కూర్చున్నాను. మ‌రీ ఎత్తుకి వెళ్తే భ‌య‌మా అని అడిగారు, భ‌యం లేద‌న‌గానే విమానం వెళ్ల‌గ‌లిగినంత ఎత్తుకి తీసుకెళ్లారు. ఇది జ‌రిగి 44 ఏళ్ల‌యింది”… అని రాసుకున్నారామె.

ఆమె బ‌యోగ్ర‌ఫీ రాసుకున్న‌ది 1954లో. అప్ప‌టికి 44 ఏళ్ల కింద‌ట అంటే 1910. ఈ ఏడాదిని నిర్ధారించ‌డానికి ఆమె మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా చెప్పారు.

ఇండియ‌న్ ఏవియేష‌న్ జ‌ర్న‌ల్‌లో ఈ సంఘ‌ట‌న‌ 1912గా త‌ప్పుగా ప్ర‌చురిత‌మైంది. దానిని ఉద‌హ‌రిస్తూ మ్రుణాళిని ఏవియేష‌న్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది పొర‌పాటు, ఆ ఏడాది త‌ప్ప‌నిస‌రిగా 1910 మాత్ర‌మే. ఆ ఏడాదికి ఒక్క ఏడాది ముందే త‌న‌కు కొడుకు పుట్టాడ‌ని కూడా కోడ్ చేశారామె.

-మంజీర‌

First Published:  3 Jan 2019 3:17 AM GMT
Next Story