Telugu Global
NEWS

పవన్‌ సీఎం కుర్చీకి పోటీ కాదనే చంద్రబాబు ఆహ్వానం

శ్వేతపత్రాలలో ఇప్పటివరకు అబద్దాలు చెప్పిన చరిత్ర లేదన్నారు. కానీ చంద్రబాబు ఇస్తున్న శ్వేతపత్రాల్లో అబద్దాలు ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌. గతంలో చంద్రబాబు చెప్పిన మాటలకు… శ్వేతపత్రాల్లో చెప్పిన విషయాలకే పొంతనలేదన్నారు. విశాఖలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన… శ్వేతపత్రాల్లో అంశాలపై వివరణ కోరితే స్పందించే వ్యక్తులు కూడా ప్రభుత్వంలో లేకుండా పోయారన్నారు. పోలవరం నుంచి మేలో నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని… కానీ మేలో గోదావరిలో నీరే ఉండదన్నారు. […]

పవన్‌ సీఎం కుర్చీకి పోటీ కాదనే చంద్రబాబు ఆహ్వానం
X

శ్వేతపత్రాలలో ఇప్పటివరకు అబద్దాలు చెప్పిన చరిత్ర లేదన్నారు. కానీ చంద్రబాబు ఇస్తున్న శ్వేతపత్రాల్లో అబద్దాలు ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌.

గతంలో చంద్రబాబు చెప్పిన మాటలకు… శ్వేతపత్రాల్లో చెప్పిన విషయాలకే పొంతనలేదన్నారు.

విశాఖలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన… శ్వేతపత్రాల్లో అంశాలపై వివరణ కోరితే స్పందించే వ్యక్తులు కూడా ప్రభుత్వంలో లేకుండా పోయారన్నారు. పోలవరం నుంచి మేలో నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని… కానీ మేలో గోదావరిలో నీరే ఉండదన్నారు. నీటిని నిల్వ చేద్దామంటే అక్కడ డ్యామే కట్టలేదన్నారు.

అలాంటప్పుడు గ్రావిటీ మీద మే నెలలో నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మేలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు పదేపదే ఈ మాట చెబుతున్నట్టుగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉండేందుకు పదేళ్లు హక్కు ఉన్నా… అమరావతిలో హడావుడిగా అన్ని తాత్కాలిక భవనాలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఏపీలో జరగకూడనివి జరుగుతున్నా ప్రశ్నించే వారే లేకుండాపోయారని ఉండవల్లి ఆవేదన చెందారు.

ఏపీలో 18లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పదేపదే అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు… తీరా శ్వేతపత్రాల్లో మాత్రం లక్షా 45 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారన్నారు. శ్వేతపత్రంలో ఇచ్చిన వివరాల కూడా తప్పుగానే ఉన్నాయన్నారు. శ్వేతపత్రంలో చెప్పిన పరిశ్రమల పేర్ల ఆధారంగా వెళ్లి చూస్తే అక్కడ ఏమీ కనిపించడం లేదని వివరించారు.

ఆదరణ పథకం ఇచ్చిన వాషింగ్ మిషన్ల నుంచి, ఎల్‌ఈడీ బల్బులు, అన్న క్యాంటీన్లు, సెల్‌ఫోన్లు వరకు కుంభకోణం జరగని పథకం లేదన్నారు. ఎల్‌ఈడీ బల్బులు బయట రూ. 600 అయితే ఆరు వేలు చెల్లించారన్నారు. వీఆర్‌వోకు ఇచ్చిన ఏడు వేల రూపాయల విలువైన ఫోన్లకు… 12వేలు చెల్లించారన్నారు.

చిన్నచిన్న వాటిలో కూడా దొరికిపోయేలా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు విలువ చేసే వస్తువుకు లక్షా 40 వేలు చెల్లిస్తున్నారన్నారు. బల్క్‌గా కొంటే రేటు తగ్గాలి కానీ… మార్కెట్ రేట్‌ కంటే చాలా ఎక్కువ మొత్తానికి కొనుగులు చేయడం ఏపీలో తప్పా ఎక్కడా జరగడం లేదన్నారు.

టీడీపీ అవినీతిని నిలదీయడంలో వైసీపీ విఫలమైందన్నారు. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించడం సరైన చర్య కానేకాదన్నారు. వైఎస్‌ అవినీతికి పాల్పడలేదని… ఈ అంశంలో ఎవరితోనైనా చర్చకు తాను సిద్దమన్నారు. చంద్రబాబు తొలి నుంచి కూడా తానొక్కడే మంచి చేస్తున్నాడు… మిగిలిన యంత్రాంగం, అధికారులు సరిగా పనిచేయడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారన్నారు.

రాష్ట్రం తరపున మోడీతో పోరాటం చేయాలనుకుంటే చంద్రబాబు తొలుత పిలవాల్సింది పవన్‌ కల్యాణ్‌ను కాదని… జగన్‌ మోహన్‌ రెడ్డిని పిలవాల్సిందన్నారు. కానీ జగన్‌ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు కాబట్టి చంద్రబాబు ఆ పనిచేయడం లేదన్నారు. పవన్ కల్యాణ్ సీఎం కుర్చీ విషయంలో పోటీ కాదన్న అభిప్రాయం చంద్రబాబుకు ఉండవచ్చని.. అందుకే మోడీపై పోరాటం చేద్దామంటూ పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకుతున్నారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఏపీలో జరుగుతున్నంత అభివృద్ధి ఎక్కడా జరగడం లేదని, జీడీపీ గ్రోత్‌ ఏపీలో ఎక్కువగా ఉందని, నెంబర్‌ వన్‌గా ఉన్నామంటూ చంద్రబాబు పదేపదే చెబుతున్న తర్వాత ఇక ఏపీకి కొత్తగా కేంద్రం ఏం సాయం చేస్తుందని ఉండవల్లి ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ ప్రధాని అయినా సరే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారు. తెలంగాణలో టీడీపీతో కలవడం వల్ల కాంగ్రెస్ నష్టపోయిందని… ఏపీలో కాంగ్రెస్‌తో కలిస్తే టీడీపీ నష్టపోతుందన్నారు.

First Published:  4 Jan 2019 12:32 AM GMT
Next Story