Telugu Global
International

విదేశీగడ్డపై టీమిండియా సిరీస్ విజయాల చిట్టా

8 దేశాల గడ్డపై సిరీస్ విజయాల భారత్ 1966-67 నుంచి 2018-19 వరకూ 8 విదేశీ విజయాలు గంగూలీ కెప్టెన్సీలో మూడు దేశాలపై సిరీస్ విజయాలు సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమిండియా… కంగారూలను కంగారూ గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన తొలి ఆసియాజట్టుగా విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా రికార్డుల్లో చేరింది. అయితే … టెస్ట్ […]

విదేశీగడ్డపై టీమిండియా సిరీస్ విజయాల చిట్టా
X
  • 8 దేశాల గడ్డపై సిరీస్ విజయాల భారత్
  • 1966-67 నుంచి 2018-19 వరకూ 8 విదేశీ విజయాలు
  • గంగూలీ కెప్టెన్సీలో మూడు దేశాలపై సిరీస్ విజయాలు

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమిండియా… కంగారూలను కంగారూ గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన తొలి ఆసియాజట్టుగా విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా రికార్డుల్లో చేరింది. అయితే … టెస్ట్ హోదా పొందిన తొమ్మిది దేశాలలో…ఎనిమిదిదేశాల గడ్డపైన మాత్రమే సిరీస్ లు సాధించింది.

విదేశీ విజయం అంత తేలికకాదు…

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో …ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు టీమిండియా…ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి…సిరీస్ నెగ్గడానికి 71 సంవత్సరాల సమయం పట్టింది.

స్వదేశీ సిరీస్ ల్లో అలవోకగా విజయాలు సాధించే వివిధ దేశాల టెస్ట్ జట్లకు…విదేశీ గడ్డపై సిరీస్ విజయాలు సాధించడం అంత తేలికకాదని చెప్పడానికి నిదర్శనమే… ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ విజయం.

స్వదేశంలో తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం, పరిస్థితుల్లో సిరీస్ విజయాలు సాధించడంలో సంతృప్తి ఉన్నా…విదేశీ గడ్డపై..అదీ ప్రతికూల పరిస్థితులు, వాతావరణంలో పోరాడి నెగ్గడంలోనే అసలు మజా ఉందని ఏ టెస్ట్ కెప్టెన్ ను అడిగినా ఇట్టే చెబుతారు.

532 టెస్టులు… 150 విజయాలు..

1932లో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన భారత్ కు…గత 86 సంవత్సరాల కాలంలో…స్వదేశీ, విదేశీ సిరీస్ ల ద్వారా మొత్తం 532 టెస్టులు ఆడిన రికార్డు ఉంది.

అయితే…సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి టెస్ట్ వరకూ…టీమిండియా ఆడిన 532 మ్యాచ్ ల్లో 150 విజయాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 150 వ విజయం సాధించడం ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.

మరో 164 టెస్టుల్లో పరాజయాలు పొందిన భారత్ ఖాతాలో 216 డ్రాలు, ఓ టై మ్యాచ్ సైతం ఉన్నాయి. అయితే…టెస్ట్ క్రికెట్లో టీమిండియా విజయాలశాతం 28.19 గా మాత్రమే ఉంది.

న్యూజిలాండ్ గడ్డపై తొలి సిరీస్ విజయం…

ఇక..విదేశీ గడ్డపై భారత్ కు మొట్టమొదటి సిరీస్ విజయాలు అందించిన ఘనతను అజిత్ వాడేకర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజరుద్దీన్, విరాట్ కొహ్లీ మాత్రమే దక్కించుకోగలిగారు.

విదేశీ గడ్డపై భారత్ కు మొట్టమొదటి సిరీస్ విజయం అందించిన గౌరవాన్ని మన్సూర్ అలీఖాన్ పటౌడీ దక్కించుకొన్నాడు. 1967-68లో కివీ గడ్డపై భారత్ 3-1తో తొలి సిరీస్ గెలుచుకొంది.

ఆ తర్వాత…మూడు సంవత్సరాల విరామం తర్వాత…అజిత్ వడేకర్ నాయకత్వంలో భారత్ డబుల్ ధమాకా నమోదు చేసింది.

1971లో ఇంగ్లండ్ గడ్డపై….

భారత్ కు క్రికెట్ నేర్పిన ఇంగ్లండ్ పై భారత్… ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ విజయం సాధించడానికి 1971 సిరీస్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

అజిత్ వడేకర్ కెప్టెన్సీలో భారత్ 1-0తో ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై ఓడించడం ద్వారా….రెండో విదేశీ సిరీస్ సాధించింది.

అదే సీజన్లో…కరీబియన్ టూర్ కు వెళ్లిన భారతజట్టు…అజిత్ వాడేకర్ నాయకత్వంలోనే 1-0తో విండీస్ ను ఓడించి…సిరీస్ విజయంతో సంచలనం సృష్టించింది.

అజార్ కెప్టెన్సీలో శ్రీలంక సిరీస్…

అయితే…పొరుగుదేశం శ్రీలంక గడ్డపై శ్రీలంకను ఓడించడానికి భారత్ సుదీర్ఘకాలమే వేచిచూడాల్సి వచ్చింది. 1993 శ్రీలంక టూర్ లో… మహ్మద్ అజరుద్దీన్ నాయకత్వంలోని భారతజట్టు 1-0తో శ్రీలంకను అధిగమించి సిరీస్ సంపాదించింది.

ఆసియా క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ ను …. బంగ్లా గడ్డపైనే భారతజట్టు… 2000-01 సిరీస్ లో ఓడించి సిరీస్ గెలుచుకొంది.

గంగూలీ కెప్టెన్సీలో తీన్మార్…

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్…బంగ్లాదేశ్ ను ఓడించగలిగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పైన భారత్..2003-04 టూర్ లో సిరీస్ విజయం సాధించింది.

సౌరవ్ గంగూలీ నాయకత్వంలోనే పాక్ ను పాక్ గడ్డపై ఓడించడం ద్వారా భారత్ 2-1తో చరిత్రాత్మక సిరీస్ సంపాదించింది.

జింబాబ్వేను జింబాబ్వే గడ్డపై ఓడించడం ద్వారా సిరీస్ సాధించిన ఘనతను సైతం సౌరవ్ గంగూలీనే దక్కించుకొన్నాడు.

వన్ అండ్ ఓన్లీ కొహ్లీ….

టెస్ట్ క్రికెట్ మాజీ నంబర్ వన్ ఆస్ట్రేలియాను …ఆస్ట్రేలియా గడ్డపై ఓడించడానికి మాత్రం …భారత్ 71 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా 2-1 గోల్స్ తో కంగారూలను కంగు తినిపించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

అంతేకాదు…ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించిన తొలి ఆసియాజట్టు ఘనతను సైతం టీమిండియా సంపాదించింది.

1947-48 సిరీస్ నుంచి ప్రస్తుత 2018-19 టెస్ట్ సిరీస్ వరకూ…కంగారూ గడ్డపై ఆసీస్ తో 47 టెస్టుల్లో తలపడిన టీమిండియాకు ఏడు విజయాలు మాత్రమే ఉన్నాయి.

ఆస్ట్రేలియా గడ్డపై 12 సిరీస్ ల్లో భారత్ ఎనిమిది సిరీస్ ల్లో ఓడి…మూడు సిరీస్ లను డ్రా చేయటమే కాదు…తొలిసారిగా ఓ సిరీస్ గెలుచుకోగలిగింది.

సఫారీ గడ్డపైన లేని సిరీస్ గెలుపు…

టెస్ట్ హోదా పొందిన తొమ్మిది దేశాలలో…ఎనిమిదిజట్ల పైన స్వదేశీ, విదేశీ సిరీస్ లు నెగ్గిన టీమిండియా…సౌతాఫ్రికా ప్రత్యర్థిగా సఫారీగడ్డపైన ఇప్పటి వరకూ ఒక్క సిరీస్ నెగ్గలేకపోయింది.

సౌతాఫ్రికాను సౌతాఫ్రికా గడ్డపైన ఓడించి… సిరీస్ నెగ్గిన రోజునే… టీమిండియా విదేశీ సిరీస్ విజయాల రికార్డు పరిపూర్ణమవుతుంది. అప్పుడే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చరితార్థమవుతుంది.

First Published:  8 Jan 2019 10:10 AM GMT
Next Story