జగిత్యాలలో కోటి విలువైన ఫోన్లు చోరీ… ఇలా దోచేశారు…

జగిత్యాలలో భారీ చోరీ జరిగింది. దొంగలు మొబైల్‌ షాపులపై పడ్డారు. పట్టణంలోని సెల్‌ పాయింట్‌, లాట్ మొబైల్‌ షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. రాత్రి రెండు గంటల సమయంలో బొలేరో వాహనంలో వచ్చిన దొంగలు కట్టర్లతో షట్టర్‌ ఓపెన్ చేశారు.

ముఖానికి ముసుగులు ధరించి పక్కాగా దొంగతనం చేశారు. దొంగలు సెల్‌ఫోన్లను దోచేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సంచుల్లో మొత్తం ఫోన్లను సర్దేశారు. రెండు షాపుల్లో మాయమైన ఫోన్ల విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు.

కౌంటర్లలో ఉన్న ఆరు లక్షల నగదును కూడా తీసుకెళ్లారు. అనంతరం బొలేరో వాహనంలో పారిపోయారు. తెల్లవారుజామున పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు షాపులు తెరిచి ఉండడాన్ని గమనించి షాపు యజమానులకు సమాచారం అందించారు.

అనంతరం లోనికి వెళ్లి చూడగా మొత్తం ఫోన్లు కనిపించలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో ఆ ప్రాంతంలో పనిచేసిన ఫోన్ కాల్స్ ద్వారా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బొలేరో వాహనం ఆధారంగా కూడా దొంగలు ఎటువైపు వెళ్లారన్నదానిపై ఆరా తీస్తున్నారు. కొన్ని క్లూస్‌ దొరికాయని.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.