దక్షిణాది మహిళలే టార్గెట్… ఆసక్తికర అంశం చెప్పిన దొంగలు

ఇటీవల దక్షిణాదిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దక్షిణాదిలో కీలక పట్టణాల్లోనే ఈ తరహా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా చైన్ స్నాచర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాను హైదరాబాద్ పోలీసులు గుర్తించి యూపీలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వారి నుంచి 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. యూపీ నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏముంది?… ఉత్తరాదిలోనే ఆ పని ఎందుకు చేయడం లేదని పోలీసులు ప్రశ్నించగా దొంగలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఉత్తరాదిలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడితే తమకు పెద్దగా గిట్టుబాటు కాదని వివరించారు. ఉత్తరాదిలో మహిళల మెడల్లో బంగారం పెద్దగా ఉండదని వివరించారు. ఒకవేళ వారు తాళిబొట్టుకు బంగారం చైన్‌ వేసుకున్నా అది ఒక తులానికి మించి ఉండదని వివరించారు. దక్షిణాదిలో మాత్రం మహిళలు అందుకు భిన్నంగా ఎక్కువ నగలు ధరిస్తారని వివరించారు.

హైదరాబాద్ లాంటి చోట్ల మహిళలు భారీ నగలనే మెడలో వేసుకుని తిరుగుతుంటారని వెల్లడించింది. హైదరాబాద్‌లో మహిళలు ధరించే నగ బరువు సరాసరి మూడు తులాల వరకు ఉంటుందని దొంగలు చెప్పారు. కాబట్టి తక్కువ స్నాచింగ్‌లతోనే ఎక్కువ సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.

దీనికి తోడు హైదరాబాద్‌ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు సులువైన మార్గాలు ఉన్నాయని అందుకే తాము ఎక్కువగా హైదరాబాద్‌లోనే చైన్ స్నాచింగ్‌ చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్‌ దొంగలు వివరించారు.