అయ్యో.. మరోసారి జూనియర్ ను పక్కన పెట్టేశారు

ఎంత కవర్ చేయడానికి ట్రై చేసినా నందమూరి కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందనే విషయం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన బయటపడింది. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను నందమూరి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కు ఎన్టీఆర్ ను పిలవలేదు.

ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నాడని కవర్ చేయడానికి వీల్లేదు. రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడని సర్దిచెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. పైగా రాజమౌళి సినిమా షూటింగ్ కూడా లేదు. కాబట్టి పిలిస్తే కచ్చితంగా వస్తాడు. కానీ ప్రీమియర్ కు తారక్ వెళ్లలేదంటే దానర్థం పిలుపు అందలేదనే.

ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ లేడు. కానీ అతడి క్రేజ్ ను మాత్రం సినిమా కోసం వాడుకున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను పిలిచారు. సినిమా ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ కావాలి కానీ ఇలాంటి ప్రత్యేకమైన ప్రీమియర్స్ కు మాత్రం జూనియర్ అక్కర్లేదు. ఈ వివక్షే తారక్ ను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది. చూద్దాం.. ఈసారి బుడ్డోడు ఎలా రియాక్ట్ అవుతాడో.