Telugu Global
NEWS

ముగిసింది పాదయాత్రే.... నా పోరాటం కాదు.... బాబును దించేద్దాం కలిసి రండి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం చూడకుండా పేదలందరికి పథకాలు అందేలా చూస్తామన్నారు వైఎస్ జగన్. వ్యవస్థ మొత్తం పేదవాడి కోసం పనిచేసేలా మార్పులు తెస్తామన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామన్నారు. 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇలా చేయడం వల్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండే వీలుంటుందన్నారు. పథకాలు వేగంగా ప్రజలకు చేరేందుకు ప్రతిగ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సచివాలయంలో […]

ముగిసింది పాదయాత్రే.... నా పోరాటం కాదు.... బాబును దించేద్దాం కలిసి రండి
X

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం చూడకుండా పేదలందరికి పథకాలు అందేలా చూస్తామన్నారు వైఎస్ జగన్. వ్యవస్థ మొత్తం పేదవాడి కోసం పనిచేసేలా మార్పులు తెస్తామన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామన్నారు. 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇలా చేయడం వల్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండే వీలుంటుందన్నారు.

పథకాలు వేగంగా ప్రజలకు చేరేందుకు ప్రతిగ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సచివాలయంలో పది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి పథకాన్ని పేదవాడి ఇంటి వద్దకే చేరేలా చూస్తామని…. ఆ సమయంలో కులం, మతం, పార్టీలు చూడబోమని…. కేవలం అర్హత మాత్రమే చూస్తామన్నారు. రేషన్‌ బియ్యం నెలనెల ఇంటి వద్దకే డోర్‌ డెలివరి చేస్తామన్నారు. రెకమెండేషన్లు, లంచాలు లేకుండా పథకాలు ప్రతి ఒక్కరికీ చేరుస్తామన్నారు.

వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఏటా మే మాసంలో 12వేల 500 రూపాయలు నేరుగా రైతుల చేతుల్లో పెడుతామన్నారు. రైతులు బోర్లు వేయాలనుకుంటే ఉచితంగా వేయిస్తామన్నారు.

తుపాన్లు, కరువులు వరుసగా వస్తున్నా ఇన్సురెన్స్‌ సొమ్ము మాత్రం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతుల తరపున తమ ప్రభుత్వమే ఇన్సురెన్స్ సొమ్ము చెల్లిస్తుందన్నారు. అక్వా రైతులకు విద్యుత్‌ను తక్కువ ధరకే ఇస్తామన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం కూడా రైతులకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తామన్నారు. రైతు పంట వేసే సమయంలోనే సదరు పంటను పలాన రేటుకు కొంటామని ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కూడా అంతకంటే ఎక్కువ ధరకే పంటను కొనే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రతి మండలంలోనూ కోల్డ్‌ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుకు ఏమైనా జరిగి చనిపోతే ఐదు లక్షల రూపాయలు చెల్లించి అతడి కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు.

నవ రత్నాలు ప్రజలందరికీ తెలిసేలా గ్రామంలో కనీసం రెండు ఫ్లెక్సీలు పెట్టాలని వైసీపీ నేతలను జగన్‌ కోరారు. మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్రలో పేదవారి కష్టాలన్నీ చూశానన్నారు. ఆరునెలలు కలిసి ఉంటే వారు వీరు అవుతారు… వీరు వారవుతారని చెబుతుంటారని… తాను 14నెలలుగా పేదలతోనే ఉంటూ వారితో నడిచానని, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాని జగన్ చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి సమస్యపైనా నేడు తాను పూర్తి అవగాహనతో ఉన్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నానని జగన్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర మాత్రమే ముగిసిందని… పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని జగన్‌ చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై తాను జరుపుతున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ తోడుగా రావాలని జగన్‌ కోరారు.

చంద్రబాబుకు అధికారంతో పాటు ఎల్లో మీడియా కూడా తోడుగా ఉందని… వాటన్నింటి పైనా యుద్ధం చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు ఒంటరిగా రాకుండా జిత్తులమారి పొత్తులతో వస్తారని … అయినా సరే ప్రజలు తోడుగా ఉంటే వీటన్నింటిని తాను జయించగలనని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి జిల్లాలోనూ సహకార డెయిరీలను ప్రోత్సహిస్తామన్నారు. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. రైతుల ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబులో భయం ఎక్కువైపోయిందన్నారు వైఎస్ జగన్‌. చంద్రబాబు మెదడుకు, నోటికి మధ్య కనెక్షన్ తెగిపోయినట్టుగా ఉందన్నారు. ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నాయన్న భయంతో కొత్తగా పేదల జపం చేస్తున్నారని విమర్శించారు. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొనుగోలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని… ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా అని ప్రశ్నించారు.

నాలుగేళ్లు మోడీతో కాపురం చేసి ఇప్పుడు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రెండు నెలలుగా మోడీకి, చంద్రబాబుకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటూ ఎల్లో పత్రికల్లో రాయించుకుంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు.

First Published:  9 Jan 2019 6:57 AM GMT
Next Story