ఏఎన్నార్ బయోపిక్‌పై నాగార్జున వ్యాఖ్యలు

ఇప్పుడు బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ప్రముఖుల జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలకు మంచి స్పందనే వస్తుండడంతో బయోపిక్‌లను తెరకెక్కించేందుకు సినీపరిశ్రమ ఆసక్తి చూపుతోంది.

ఎన్టీఆర్‌ బయోపిక్ విడుదలైన నేపథ్యంలో అక్కినేని నాగేశ్వర రావు మీద సినిమా తీస్తారా? అన్న చర్చ నడుస్తోంది. ఏఎన్నార్‌పై సినిమా తీయాలా లేదా అన్నది నాగార్జునే చెప్పాలని సుమంత్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై తిరుమల వచ్చిన అక్కినేని నాగార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌ గురించి త్వరలో  వెల్లడిస్తానని చెప్పారు. త్వరలోనే తాను నటించే కొత్త సినిమా వివరాలు కూడా చెబుతానన్నారు.

ఏఎన్నార్‌ బయోపిక్‌పై మీడియా ప్రతినిధులు మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా… నాగార్జున నవ్వుతూ వెళ్లిపోయారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని నాగార్జున దర్శించుకున్నారు.