ఆ టీ స్టాల్‌ వద్దకు వెళ్తా – మహీంద్రా గ్రూప్‌ అధినేత

కుబేరులకు మాత్రమే చోటు దక్కే ఫోర్బ్స్ జాబితాలో టీ స్టాల్ నడుపుతున్న వృద్ధ దంపతులకు చోటు దక్కడం అందరినీ ఆకట్టుకుంటోంది.

వారి కలలను సాకారం చేసుకునేందుకు వృద్ధ దంపతులు అనుసరిస్తున్న విధానమే ఫోర్బ్స్‌ను ఆకర్షించింది. రిచెస్ట్‌ లిస్ట్-2019లో చోటు దక్కించుకున్నారు ఈ దంపతులు. కేరళకు చెందిన విజయన్‌కు దేశాలన్నీ చుట్టిరావాలన్నది చిన్ననాటి నుంచి ఉన్న కోరిక.

ఇందుకోసం భారీగా డబ్బు కావాలని తెలుసు. అందుకే టీ స్టాల్‌ నిర్వహిస్తూ అందులో కొంత ఆదాయాన్ని విదేశీ పర్యటనల కోసం విజయన్ దంపతులు పొదుపు చేశారు. రోజుకు 300 వందలు పొదుపు చేసేవారు. ఇప్పటి వరకు అలా 23 దేశాలను చుట్టి వచ్చారు. 55 ఏళ్లుగా టీ కొట్టు నడుపుతూనే ఉన్నారు.

ఇలా ఫోర్బ్స్ జాబితాలో ఎక్కిన విజయన్ దంపతులను సెలబ్రేటిలు కూడా అభినందిస్తున్నారు. మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా వీరిపై ట్వీట్ చేశారు. ఈసారి కొచ్చి వెళ్లినప్పుడు తప్పకుండా వీరి టీకొట్టు వద్దకు వెళ్లి టీ తీసుకుంటానని చెప్పారు. వారితో విదేశీ పర్యటనల విషయాలు తెలుసుకుంటానన్నారు. ఈ దంపతులు సంపద విషయంలో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించకపోయినా… తన దృష్టిలో మాత్రం వీరే భారతదేశంలో అత్యంత సంపన్నులని మహీంద్ర ప్రశంసించారు.