సీఎల్పీ పదవి భట్టి విక్రమార్కకేనా?

ఓటమి నుంచి తేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ….సీఎల్పీ నేత ఎన్నికపై దృష్టి సారించింది. ఈ నెల 16న సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎల్పీ రేసులో పలువురు కీలక నేతలున్నారు. వారందరు రేసులో ఉండడంతోనే పోటి నెలకొంది.

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత రేసులో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పటికే నేతలంతా ఢిల్లీ పెద్దల దగ్గర సీఎల్పీ పదవి కోసం లాబీయింగ్ చేసినట్టు సమాచారం. సీఎల్పీ నేతను ఎన్నుకునే బాధ్యతను వేణుగోపాల్ కు అధిష్టానం అప్పగించింది. దీంతో నేతలంతా వేణుగోపాల్ చుట్టూ తిరుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మధ్యే గట్టి పోటీ ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో భట్టి విక్రమార్క కు డిప్యూటి స్పీకర్ గా, చీఫ్ విప్ గా పని చేసిన అనుభవం ఉంది. శ్రీధర్ బాబు మంత్రిగా పని చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉన్నా శాసన సభకు మాత్రం మొదటిసారిగానే ఎంపికయ్యారు. దీంతో అతనికి అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డినే సీఎల్పీ నేతగా నియమిస్తారని వార్తలు వచ్చినా పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా అతనిని పిసిసి అధ్యక్షునిగానే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.

కాగా భట్టి విక్రమార్కనే సీఎల్పీ నేతగా నియమించాలని సూత్రపాయంగా నిర్ణయించినట్టు కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. సబితా ఇంద్రా రెడ్డి పోటిలో ఉన్నా పిసిసి ఉత్తమ్ సామాజిక వర్గం, సబిత సామాజిక వర్గం ఒకటే కావడంతో ఆమెకు అవకాశం దక్కదని తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ గా సబితా ఇంద్రారెడ్డి లేదా శ్రీధర్ బాబు వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే సీఎల్పీ నేత ఎంపిక దాదాపుగా పూర్తియినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి పదవి ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భట్టికి ఈ పదవి ఇవ్వడం ద్వారా అందరికి సమాన అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని కాంగ్రెస్ మాత్రం దళితులకు ప్రాధాన్యత ఇచ్చిందని నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 16 వ తేదిన ఏం జరగబోతుందోనన్న ఆసక్తి అందరీలో నెలకొంది.