చంద్రబాబుకు ముందే చెప్పాం…. అది అయ్యే పనికాదు….

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌- చంద్రబాబు కలిసి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఇప్పటికే యూపీఏలో ఉన్న పార్టీలు మినహా కొత్తగా ఎవరూ కూడా జత కట్టేందుకు ముందుకు రావడం లేదు.

బుధవారం ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తాను కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న మహాకూటమిలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తామని వివరించారు. ఇప్పుడు సీపీఎం కూడా మహాకూటమిలో చేరేందుకు నో చెప్పింది.

ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా స్పష్టం చేశామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి బుధవారం మీడియాకు వివరించారు. ఇలాంటి కూటమిలు ఎన్నికలకు ముందే ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనికాదన్నారు.

వైరుధ్యం ఉన్నపార్టీలు ఒకే కూటమిలో ఉంటూ ఎన్నికలకు వెళ్లడం వీలుకాదన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కమ్యూనిస్టులు ఒకే కూటమిలో ఎన్నికలకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి కూటమి ఏర్పాటు ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాతే ఉంటుందన్నారు.

2004లోనూ ఎన్నికల తర్వాతే పలుపార్టీలు కలిసి యూపీఏ ప్రభుత్వాన్నిఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.

ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించే విషయంలో మాయవతి, అఖిలేష్‌, మమత లాంటి వారు సుముఖంగా లేరు. ఇప్పుడు సీపీఎం కూడా ఎన్నికలకు ముందు మహాకూటమికి నో చెప్పడంతో ఇక కొత్తగా కాంగ్రెస్‌- టీడీపీతో చేతులు కలిపే వారు ఉండకపోవచ్చు.