మరో మహా యాగానికి సిద్ధమైన కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహా యాగానికి సిద్ధమవుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం నిర్వహించనున్నారు.

జనవరి 21 నుంచి జనవరి 25 వరకు ఈ యాగాన్ని చేయనున్నారు. మూడు సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ ఇక్కడే చండీయాగం నిర్వహించారు. గత సంవత్సరం ఎన్నికలకు వెళ్ళే ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.

కాగా ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఇప్పటికే యాగం పనులు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. ఇప్పటికే వేదపండితులకు మరియు రుత్వికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

శృంగేరీ పీఠ పండితులు శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో యాగ నిర్వహణ ఏర్పాట్ల పై సీఎం కేసీఆర్ చర్చించారు. యాగానికి సంబంధించి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్ధ, విశాఖ పీఠాధిపతి శారదా స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, సలహాలు కేసీఆర్ తీసుకున్నారు.

ఈ యాగానికి సందర్శకులను అనుమతించాలా? వద్దా? అనే దాని పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పలువురు ప్రముఖులు ఈ యాగంలో పాల్గొననున్నారు.