ఆర్ధిక ఇబ్బందుల్లో మన్మోహన్‌ సింగ్… మాజీ ఎంపీ వద్ద ఆవేదన

పదేళ్ల పాటు భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. తన పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా డబ్బుల్లేవంటున్నారాయన.

బుధవారం తనకు సన్నిహితుడైన మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ… పార్లమెంట్‌ ఆవరణలో ఎదురుపడిన సమయంలో మన్మోహన్ సింగ్ కాసేపు ముచ్చటించారు. తనపై తీస్తున్న బయోపిక్‌పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బతికి ఉన్న వారిపై బయోపిక్‌ సినిమాలు తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ”ద యాక్సిడెంటల్‌ ఫ్రైమ్ మినిస్టర్” సినిమా ట్రైలర్‌లో తనను చులకన చేస్తూ ఉన్న సంభాషణలు, సన్నివేశాలపై పరువు నష్టం దావా వేయాల్సిందిగా కొందరు సూచించారని వివరించారు.

కానీ పరువు నష్టం దావా వేయాలంటే ముందుగా సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుందని… అంత డబ్బు తన వద్ద ఎక్కడుందని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యాయవాదులకు భారీగా ఫీజులు ఇవ్వాల్సి ఉంటుందని అంత స్తోమత తనకు లేదన్నారు. అందుకే పరువు నష్టం కూడా వేయలేకపోతున్నానని వివరించారని…. యలమంచిలి శివాజీ మీడియాకు వివరించారు.

సుధీర్ఘ కాలం పాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ వద్ద… చివరకు ఆయన పరువు కోసం దావా వేసేందుకు కూడా డబ్బులు లేవంటే బాధాకరమే అయినా… ఆయన నిజాయితీని మాత్రం అభినందించాల్సిందే.