పోలీసులకు గుడ్‌ న్యూస్

సంస్కరణల్లో ముందుంటున్న తెలంగాణ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బందిలో పని నాణ్యతను పెంచేందుకు మరో అడుగు ముందుకేసింది.

పోలీసు సిబ్బంది ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలను చేరుకునేలా పనిచేయాలంటే తొలుత వారికి విరామం, సంతోషం ఉండాలని నిర్ణయించారు. ఇందు కోసం తొలిసారిగా పోలీసు శాఖలోనూ షిప్ట్‌ల విధానాన్ని అములులోకి తేవాలని నిర్ణయించారు. వీక్‌ ఆఫ్‌ను అమలులోకి తీసుకురానున్నారు.

మరో ఆరు నెలల్లో కొత్తగా పోలీస్ శాఖలో 12వేల పోస్టులను భర్తీ చేస్తున్న నేపథ్యంలో… పోలీసులకు షిప్టులు, వారాంతపు సెలవులను అమలు చేయాలని నిర్ణయించినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

పోలీసింగ్‌ మెరుగుపడాలంటే షిఫ్ట్‌ పద్ధతే సరైనదని బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్ మెంట్‌ (బీపీఆర్‌డీ), ఆస్కీ సంయుక్త అధ్యయనంలో తేలిందని వివరించారు. ఎనిమిది గంటల షిఫ్ట్‌తో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని, వారానికొక రోజు సెలవు ఇవ్వడం వల్ల పోలీసులు మానసికంగా ధృఢంగా ఉంటారని వివరించారు.

ఒక వ్యక్తి సెలవు లేకుండా గరిష్ఠంగా 12 రోజులు మాత్రమే పని చేయగలుగుతాడని…. ఆ తర్వాత అతని నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం కనుమరుగు అవుతుందని…. ఇది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమని… అందుకే షిప్టులు, వీక్‌ ఆఫ్‌లను తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.