ఓట్లు కురిసే మరో అస్త్రాన్ని ప్రయోగించిన మోడీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఉభయసభల్లో బిల్లును ఆమోదించేలా చేయగలిగిన మోడీ… ఇప్పుడు జీఎస్టీ వైపు అడుగులు వేశారు.

జీఎస్టీ వల్ల చిరువ్యాపారులు ఇబ్బంది పడడంతో పాటు… బాధితుల్లో ఎక్కువగా బీజేపీ సాంప్రదాయ ఓట్టు బ్యాంకు వర్గాలే ఉండడంతో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. జీఎస్టీ నుంచి చిన్నవ్యాపారులకు మినహాయింపును ప్రకటించారు.

ఇప్పటి వరకు వార్షిక టర్నోవర్‌ 20లక్షలకు లోపు ఉన్న వారికి మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని 40లక్షలకు పెంచారు. జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సవరణలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయి.

ఇకపై 40లక్షలకు లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వారు ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 10 లక్షలలోపు వార్షిక టర్నోవర్‌ ఉన్న వారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు అక్కడ ఆ పరిమితిని 20లక్షలకు పెంచారు.

అయితే ఈ టర్నోవర్ పరిమితిని పెంచడం కారణంగా రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పరిమితి పెంపును అమలు చేయాలా లేదా అన్న నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారు.

తాజా పరిమితి పెంపును అమలులోకి తెస్తారో లేదో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారంలోగా తమ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. జీఎస్టీ టర్నోవర్ పరిమితిని 20 లక్షల నుంచి 40లక్షలకు పెంచడం వల్ల పన్నుచెల్లించే వారి సంఖ్య తగ్గిపోనుంది. దీని వల్ల రాష్ట్రాలు 5వేల 200 కోట్ల ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా.

మొత్తం మీద జీఎస్టీ నుంచి పన్ను మినహాయింపు పరిమితిని 20లక్షల నుంచి 40లక్షలకు పెంచడం ద్వారా లక్షలాది మంది వ్యాపారులకు ఊరట లభించనుంది.