పాండ్యాను వెనకేసుకొచ్చిన హిమాన్ష్…. ఏమన్నారంటే….

మహిళలను కించపరిచేలా క్రికెటర్లు పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. బీసీసీఐ కూడా సీరియస్‌గా స్పందించింది. రెండు వన్డే మ్యాచ్‌ల్లో వేటుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాము చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు ఆటగాళ్లు క్షమాపణలు చెప్పినా బీసీసీఐ వెనక్కు తగ్గలేదు.

అటు సోషల్ మీడియాలోనూ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా తండ్రి హిమాన్ష్‌ స్పందించారు. తన కుమారుడు మంచి వాడని చెప్పారు. సరదాగా తన కుమారుడు చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది అతిగా స్పందిస్తున్నారని విమర్శించారు.

తన కుమారుడు పాల్గొన్న కాఫీ విత్ కరణ్‌ కార్యక్రమం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఏర్పాటు చేసిందని…. దాంతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు తన కుమారుడు సరదాగా వ్యాఖ్యలు చేశారని హిమాన్ష్‌ అభిప్రాయపడ్డారు. దానికే ఈ స్థాయిలో విమర్శల దాడి చేయడం సరికాదన్నారు. పాండ్యా చేసిన వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాల్సినవి కావన్నారు.

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాల్గొన్న పాండ్యా ‘‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదో టైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే…. నేను ఈ రోజు …ఆ పని చేసొచ్చా అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు.