ఆ పార్టీలో చేరేంత ఖర్మ నాకు పట్టలేదు….

మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆమె గన్‌మెన్లను తిరస్కరించారు. భద్రత లేకుండానే పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో అఖిలప్రియ అనుచరులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటో కూడా ఉండడం లేదు.

టీడీపీలో ఒంటరైన ఆమె… జనసేనలో చేరుతారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. తాను జనసేనలో చేరడం లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా జనసేనలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ ఆళ్లగడ్డ నుంచే పోటీ చేసి గెలుస్తానని.. తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని చెప్పారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తుండడం వల్లే గన్‌మెన్లను తిరస్కరించానని అంతకు మించి ఏమీ లేదన్నారు.

పోలీసుల తీరును చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారామె. తాను అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబును వదిలేసి జనసేనలోకి తానెందుకు వెళ్తానని నిలదీశారామె.