కార్తి కోసం సూర్య

పూర్తిగా మేకోవర్ అయి కార్తి చేసిన సినిమా దేవ్. రకుల్ హీరోయిన్ గా నటించింది. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు ప్రచారం షురూ చేశారు. ఇందులో భాగంగా ముందుగా పాటల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 14న దేవ్ సినిమా తెలుగు పాటల్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు హీరో కార్తి, హీరోయిన్ రకుల్ రాబోతున్నారు.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు కార్తి అన్నయ్య, హీరో సూర్య ప్రత్యేక అతిథిగా వస్తాడట. అయితే ఈ విషయం ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. రీసెంట్ గా కార్తి నటించిన సినిమాలేవీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. చినబాబు సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించాడు కార్తి. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు కార్తి కోసం సూర్య రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది.

మేకర్స్ ఈ విషయాన్ని ఇంకా నిర్థారించలేదు. నిజంగా సూర్య వస్తే ఆడియో ఫంక్షన్ కాకుండా, ప్రత్యేకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రాబోతోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను రిలయన్స్ పిక్చర్స్ సమర్పిస్తోంది.