అమరావతికి సమాంతరంగా మరో నగరం – చంద్రబాబు సంచలన ప్రకటన

అమరావతి రాజధాని కోసం ఇప్పటికే దాదాపు 33వేల ఎకరాల భూమిని రైతులను నుంచి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది. స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణా జిల్లాలోనూ ల్యాండ్ పూలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు…. అమరావతి తరహాలో మరో సిటీ నిర్మాణానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. గుంటూరు వైపు కాదు… కృష్ణా జిల్లా వైపు కూడా చూడాలని కొందరు అడుగుతున్నారని అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

తాను చూపు పెట్టడానికి సిద్దంగా ఉన్నానని…. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధపడాలన్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధమంటే తాను మరో నగరాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అమరావతితో పాటు సమాంతరంగా ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక గొప్ప నగరాన్ని నిర్మిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచానికే ఆదర్శంగా కృష్ణానదికి కుడి, ఎడమల రెండు గొప్ప నగరాలు నిర్మిస్తామన్నారు. అమరావతి రైతులను ఆదర్శంగా తీసుకుని కృష్ణా జిల్లా రైతులు కూడా భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు.