జగన్‌ ఇచ్చిన మరో హామీని సొంతం చేసుకున్న చంద్రబాబు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. తాము అధికారంలోకి రాగానే వృద్ధులకు పించన్‌ రెండు వేలు చేస్తామని వైసీపీ తన నవరత్నాల్లో చేర్చింది. అయితే జగన్‌ పాదయాత్ర ముగిసిన వెంటనే చంద్రబాబు వృద్ధుల పించన్ పెంచేశారు. వెయ్యి రూపాయలను రెండు వేలు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఫిబ్రవరి ఒకటి నుంచి పెరిగిన పించన్ ఇస్తామని వెల్లడించారు. దీంతో జగన్ ఇచ్చిన హామీని చంద్రబాబే అమలు చేసినట్టు అయింది. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన మరో హామీని సైతం ఇప్పుడు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోబోతోంది. పాదయాత్రలో జగన్‌ను పలుచోట్ల కలిసిన ఆటో యూనియన్లు తమపై పన్నుభారం తగ్గించాలని కోరారు.

రైతులు కూడా ట్రాక్టర్లపై వేస్తున్న పన్ను ఎత్తివేయాలని కోరారు. దాంతో తాము అధికారంలోకి రాగానే ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు ఎత్తివేస్తామని జగన్ ప్రకటించారు.

ఇంతలో చంద్రబాబే ఆ పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఆటోలు, రైతులు వాడే ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాల్సిందిగా రవాణా శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

జీవిత కాల పన్ను కింద ఒక్కో ఆటోకు ఇప్పటి వరకు నాలుగువేల రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను కింద మూడు నెలలకు 300 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదికి 12 వందల రూపాయలు  రైతులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేస్తే ఆ మేరకు ఆటో ఓనర్లకు, ట్రాక్టర్లు ఉన్న రైతులకు లబ్ది జరగనుంది.