పవన్‌ కల్యాణ్‌ రోజూ ఇన్ని గంటలు చదువుతారట!…

పొత్తు ఆహ్వానాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన… జనసేనకు బలం లేదని చెప్పిన వారే రాబోయే ఎన్నికల్లో కలిసి రావాలని పిలుపునివ్వడం బట్టే జనసేన బలం ఏంటో అర్థమవుతోందన్నారు.

కొందరు టీఆర్‌ఎస్ నాయకుల ద్వారా పొత్తు కోసం మాట్లాడిస్తున్నారని పవన్‌ కల్యాణ్ చెప్పారు. జనసేనకు ప్రజాబలం ఉంది కాబట్టే ఇలాంటి ఆహ్వానాలు వస్తున్నాయని చెప్పారు. జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన సమయం వచ్చేసిందన్నారు.

2014లో నమ్మి టీడీపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తనను ఎదుటి వారు దిగజారి తిట్టినా తాను మాత్రం దిగజారి విమర్శలు చేయబోనన్నారు. తాను ఇంటర్‌తోనే చదువు ఆపేశానే గానీ… చదవడం మాత్రం ఇప్పటికీ ఆపలేదన్నారు. తాను ఇప్పటికీ రోజుకు ఎనిమిది గంటల పాటు చదువుతుంటానని పవన్‌ కల్యాణ్ వివరించారు.

పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ రావడం పార్టీకి అనుకూలించే అంశంగా  అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి తనకు టీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇప్పుడు టీ గ్లాసే గుర్తుగా రావడం ఆనందంగా ఉందన్నారు.

అయితే పొత్తుల కోసం కొందరు టీఆర్‌ఎస్ నేతల చేత మాట్లాడించారని పవన్‌ చెప్పడం కీలకమే. ఇటీవల చంద్రబాబు కూడా తనతో కలిసి రావాలని పవన్‌ను ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్ నేతల ద్వారా రాయబారం అంటే బహుశా వైసీపీ కూడా తన మద్దతు కోసం ఆశపడుతోందని పవన్‌ కల్యాణ్ చెప్పదలుచుకున్నట్టుగా ఉందని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. రోజంతా జనం మధ్య ఉండే పవన్ రోజుకు ఎనిమిది గంటలు ఎలా చదవగలుగుతున్నాడని ప్రశ్నిస్తున్నారు.

టీఆర్ఎస్ ద్వారా తనను సంప్రదిస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళే అనే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడుతున్నాడని అయితే వచ్చే ఎన్నికల్లో మేము ఎవ్వరితోనూ పొత్తుపెట్టుకోమని జగన్ తెగేసి చెబుతున్నా ఇలా లీక్ లు ఇవ్వడం ఏం సంస్కారం అని వైసీపీ వాళ్ళు కూడా మండిపడుతున్నారు.