కాలు తెగిపోయింది…. బాడీ 500 కి.మీ వెళ్లింది….

తమిళనాడులో ఘోరం జరిగింది. చెన్నైకు సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతదేహం 24 గంటల పాటు గల్లంతు అయింది. 500 కిలోమీటర్ల దూరంలో దాన్ని గుర్తించారు.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టుకు చెందిన సుధాకర్ అనే యువకుడు… ఈనెల 9న మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా చెన్నై సమీపంలోని పాండూరు వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది.

దాంతో సుధాకర్ కాలు తెలిగిపోయి రోడ్డు మీదే పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వెతకగా కేవలం తెగిపోయిన కాలు మాత్రమే దొరికింది. మిగిలిన శరీరం కనిపించలేదు. అయితే ప్రమాద సమయంలో కారు వేగంగా ఢీకొట్టడంతో సుధాకర్ శరీరం అటుగా వెళ్తున్న లారీలోకి ఎగిరిపడింది.

సదరు లారీ కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన అరుణాచలం ట్రాన్స్‌పోర్టుకు చెందినది. కానీ సుధాకర్ శరీరం లారీలో పడ్డ విషయాన్ని డ్రైవర్ గుర్తించలేదు. ఎదో పెద్ద శబ్ధం వచ్చినట్టు వినిపించడంతో డ్రైవర్ లారీని ఆపి టైర్లను మాత్రమే పరిశీలించి తర్వాత ప్రయాణం సాగించాడు.

24 గంటల తర్వాత లోడ్‌ కోసం ఒక ఫ్యాక్టరీలోకి వెళ్లగా అక్కడి సిబ్బంది లారీని తనిఖీ చేయగా… మృతదేహం  ఉండడాన్ని గమనించారు. దాంతో షాక్ అయ్యారు. నెత్తురోడి ఉన్న మృతదేహం చూసి భయపడిపోయారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి చూడగా సుధాకర్‌ జేబులో ఆధార్ కార్డు దొరికింది.

దాని ఆధారంగా తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈనెల 9న పాండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సుధాకర్‌దే ఈ మృతదేహం అని గుర్తించారు. ప్రమాద స్థలంలో కాలు మాత్రమే దొరకడం, లారీలో ఉన్న మృతదేహానికి కాలు లేకపోవడంతో గుర్తించడం సులువుగానే జరిగింది. మృతదేహాన్ని తమిళనాడు పోలీసులకు అప్పగించారు.