శ్రీశైలంలో క్రిస్మస్‌ వేడుకలు… ఏఈవోపై సస్పెన్షన్ వేటు

శ్రీశైలంలో మరో వివాదం తలెత్తింది. శ్రీశైలం ఆలయ పరిధిలో అన్యమత వేడుకలు కలకలం రేపాయి. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆలయ ఏఈవో మోహన్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.

డిసెంబర్‌ 25 న క్రిస్మస్‌ సందర్భంగా శ్రీశైలంలోని గంగాసదన్‌పై ఏఈవో మోహన్‌ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై వేటు వేసినట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. పూర్తి విచారణ తర్వాతే వేటు వేసినట్టు ప్రకటించారు.

ఇటీవలే ఆలయ అర్చకుడు తాంత్రిక పూజలు చేస్తూ దొరికిపోయారు. దాంతో ఆయనపైనా వేటు వేశారు. ఇంతలోనే ఏఈవో అన్యమత వేడుకలు నిర్వహించినట్టు తేలడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు.